అనంతపురం ప్రతినిధి : నిత్యం కరువుతో పోరాటం సాగించే 'అనంత' రైతుల్లో సాగుపై ఆసక్తి తగ్గుతోంది. క్రమక్రమంగా జిల్లాలో సాగు విస్తీర్ణం పడిపోతోంది. ఒకప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 23 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. అటువంటిది క్రమంగా తగ్గుతూ 15 లక్షల ఎకరాల్లోపుకు పడిపోయింది. 2014 సంవత్సరంలో 17.16 లక్షల ఎకరాలుండే సాగు విస్తీర్ణం తగ్గుతూ ఈ ఏడాది 9.23 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఒకప్పుడు జిల్లాలో 23 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేవి. క్రమంగా తగ్గుతూ వస్తుండటం గమనార్హం.
మరింతగా పడిపోయిన వేరుశనగ
ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోతుండగా ప్రధాన పంట అయిన వేరుశనగ మరింత అధికంగా పడిపోతోంది. సాగునీటి వసతి తక్కువగానున్న ఈ ప్రాంతంలో వర్షాధారం కింద అత్యధికంగా సాగయ్యేది వేరుశనగ పంటయే. ఈ దశబ్ధాకాలంలో మరింత ఎక్కువగా సాగుపడిపోయింది. ఒకప్పుడు సాధారణ సాగులో 23 లక్షల ఎకరాలవుతుంటే 18 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట సాగయ్యేది. ఈ ఏడాది ఆరు లక్షల ఎకరాల్లోపే పడిపోయింది. వేరుశనగ స్థానంలో కొంత వరకు ఆముదం, పత్తి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. వరుస కరువులు, పెట్టిన పెట్టుబడులు కూడా సరిగా రాకపోవడంతో రైతులు ఆ పంటపై ఆసక్తిని తగ్గించుకుంటుపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సహకాలు కరువవుతున్నాయి.
ప్రభుత్వ సహకారం కరువు
రైతు ప్రభుత్వాలు అని చెప్పుకునే పాలకులు నిత్యం కరువుతో పోరాడే రైతులకు ఆదుకునే చర్యలేవి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేరుశనగ సాగుపై పెరుగుతున్న పెట్టుబడికి తగ్గట్టు గిట్టుబాటు ధర ఉండటం లేదు. వర్షాభావంతో పంటనష్టపోతే సరైన బీమా సౌకర్యం కూడా లేదు. వాతావరణ బీమా ఉన్నప్పటికీ నష్టానికి తగ్గట్టు పరిహారం రావడం లేదు. మరోవైపు ప్రభుత్వాలు ఇన్‌పుట్ సబ్సిడీ సైతం రాని పరిస్థితి నెలకొంది. బీమా విధానంలో మార్పులు తీసుకురావాలని రైతు సంఘాలు ఒకవైపు డిమాండ్ చేస్తున్నా పట్టించుకునే వారు లేరు.
సంవత్సరం సాధారణ సాగు సాగైంది (లక్షల ఎకరాల్లో)
2014 20.78 17.16
2015 20.65 15.23
2016 20.52 18.95
2017 19.79 15.08
2018 18.45 14.90
2019 17.49 14.21
2020 16.80 15.68
2021 16.80 15.83
2022 16.12 16.75
2023 16.16 9.23










