Oct 10,2023 19:37

పాదయాత్రలో మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి-ఆలూరు
వేదవతి రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేస్తే సాగు, తాగునీరు లభించి, జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజానీకానికి జీవనోపాధి ఉంటుందని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు తెలిపారు. ఎపి రైతుసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పాదయాత్ర మంగళవారం రెండోరోజు నెరణికి తండా నుంచి కరడిగుడ్డం, హులేబీడు, తుంబలబీడు, పెద్ద హోతూరులో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు లేకపోవడంతో చదువుకున్న యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణకు వెళ్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలకులు హామీలకే పరిమితి అవుతున్నారని మండిపడ్డారు. ఆలూరు ప్రాంతానికి టమోటా జ్యూష్‌ ఫ్యాక్టరీ, జింకల పార్కు రైతులకు కలగానే మిగిలిందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే పాలకులకు ప్రజలు గుర్తుకొస్తారని, తర్వాత స్వంత ప్రయోజనాలకు పాటు పడే నాయకులను ప్రశ్నించి హక్కులను కాపాడుకొందామని కోరారు. ప్రభుత్వానికి, పాలకులకు కనువిప్పు కలిగించేలా నేడు ఆలూరు తహశీల్దార్‌ కార్యాలయం ముందు జరిగే మహా ధర్నాలో రైతులు, యువత, విద్యార్థులు, వివిధ కార్మిక సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కెపి.నారాయణ స్వామి, రైతుసంఘం హాలహర్వి, దేవనకొండ మండల కార్యదర్శులు ధనుంజయ, సూరి, సిఐటియు నాయకులు కృష్ణ, షాకీర్‌, ఐద్వా మండల కార్యదర్శి షేకున్‌బీ, డివైఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు గోవర్ధన్‌, మైనా, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు పోతురాజు, గిరి, రవి, బసవరాజు, రైతులు పాల్గొన్నారు.