పాచిపెంట: గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన హక్కులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండల గౌరవ అధ్యక్షులు సూకురు అప్పలస్వామి, సహాయ కార్యదర్శి కొర్ర కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలోని గొట్టూరు పంచాయతీ తోక మెట్టజంక్షన్ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం పాచిపెంట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల పట్ల పాలకుల చిన్నచూపు వల్ల తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు నేటికీ హక్కులు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం తలచుకుంటే కుడుమూరు, కొండతాడూరు భూములకు పట్టాలు నెల రోజుల్లో ఇవ్వొచ్చని, గిరిజనుల పట్ల చిన్నచూపు వల్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా సాగు హక్కులు జాబితా ప్రకటించి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చిట్టిపురం, తుమ్మరావల్లిలో ఆంధ్రా జమీందారుల పేరుతో భూములను కాలయాపన చేస్తూ గిరిజనులకు భూమ్మీద హక్కులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలు ప్రాధాన్యతను తగ్గించి పీసా చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు పాలకులు మానుకోవాలని అన్నారు. గిరిజన సంఘం ప్రతినిధి బురిడి సన్యాసిరావు మాట్లాడుతూ మణిపూర్లో గిరిజనులపై దాడులు మహిళలపై అత్యాచారాలు అమానుషమని, అక్కడ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, అక్కడి బాధిత గిరిజనులకు అండగా నిలవాలని అన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి రహదారులు, వైద్యం అందుబాటులో ఉండేలా పాలకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.










