ప్రజాశక్తి-ఆదోనిరూరల్
విద్యార్థి దశలోనే ఉన్నతమైన ఆలోచనలు కలిగి కార్యాచరణ, సాధన చేసి లక్ష్యాలను సాధించాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలోని మున్సిపల్ గ్రౌండ్‌లో నెహ్రూ మెమోరియల్ స్కూల్, మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు బాల్యవివాహాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని తెలిపారు. బాల్యవివాహాలు చేస్తే జరిగే అనర్థాలను వివరించారు. తల్లిదండ్రులు బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. 18 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మాయిలకు వివాహం చేయకూడదని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. మంచి ఆలోచనలు, అలవాట్లు విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలని తెలిపారు. జీవితం ఆనందమయం కావాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. దేశ భవితకు ఆయువుపట్టుగా, బలమైన శక్తిగా విద్యార్థి దశలోనే ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథ్‌రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రజనీకాంత్ రెడ్డి, ఎంఇఒ శివరాములు, శ్రీనివాసులు, సిఆర్‌పిలు హుస్సేనప్ప, మల్లికార్జున, బీచుపల్లి పాల్గొన్నారు. నందవరంలో మద్యపానం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎంపిడిఒ దశరథ రామయ్య ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. నందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాఠశాల నుంచి నందవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో ప్రధాన కూడలిలో నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. డిప్యూటీ తహశీల్దార్ రఘువీర్, ఎంపిడిఒ దశరథ రామయ్య, ఇఒఆర్‌డి ఈశ్వరయ్య స్వామి, ఎంఇఒ సుదర్శన్ రెడ్డి, ఎపిఎం వీరన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాం, ఉపాధ్యాయులు ఈరన్న, ప్రసాద్, సిఆర్‌పిలు ఉరుకుందు, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఆదోనిలో మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్










