Oct 27,2023 23:21

సాధికారతను అందించిన ఘనత జగన్‌దే..

సాధికారతను అందించిన ఘనత జగన్‌దే..
మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌
యాత్రను ప్రారంభించిన విజరు సాయి రెడ్డి
ప్రజాశక్తి- తిరుపతి సిటీ
వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రను ఆపార్టీ అనుబంధ సంఘాల సమన్వయకర్త విజరుసాయిరెడ్డి ప్రారంభించారు. నగరంలో అన్ని డివిజన్లో తిరిగిన ఈ యాత్ర గ్రూప్‌ థియేటర్‌ సమీపంలో జరిగిన బహిరంగ సభ వద్ద ముగిసింది. సభను ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాజ్యాధికారం ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని భావించి వారికి పదవులు ఇచ్చిన ఘనత జగనన్నదే అన్నారు. ఓదార్పు యాత్రలో భూమన కరుణాకర్‌రెడ్డి కింద పనిచేయడాన్ని మరువలేనని, కరుణన్న ప్రసంగం ప్రజారంజకంగా ఎంతో ఆసక్తిగా ప్రవాహంలా కొనసాగుతుంటుందని అన్నారు. అయితే కరుణాకర్‌రెడ్డిని మరిపించేలా భూమన అభినరు ప్రసంగిస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. కరుణాకరన్న బిడ్డ అభినరును, మీ చేతుల్లో పెడుతున్నారని, ఈసారి జరిగే ఎన్నికల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఎమ్మెల్యేగా గెలిపించండి అని పిలుపునిచ్చారు. తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ రెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేటర్లుగా కేటాయించడం, గెలిపించుకోవడం జరిగిందన్నారు. అన్ని కులాల సమ్మేళనంగా టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నామని, మేయర్‌ పదవిని జనరల్‌ కేటగిరికి కేటాయిస్తే దాన్ని బీసీ మహిళకు కేటాయించామన్నారు. షాదీ మహల్‌, జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ను పూర్తి చేసింది కూడా జగనన్న ప్రభుత్వమే, బీసీలకు స్థానిక చిన్న గంగమ్మ, పెద్ద గంగమ్మ ఆలయాలకు, అలాగే టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్లుగా నియమించింది వైసీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. తిరుమలలో సన్నిధి గొల్ల వివాదం కాకుండా పరిష్కరించిన ఘనత భూమన కరుణాకర రెడ్డిదే అన్నారు. 2019లో భూమన కరుణాకర రెడ్డికి 80వేల ఓట్లు వస్తే, ఈరోజు జగనన్న ప్రభుత్వంలో రెండు లక్షల మందికి పైగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
తిరుపతి నగరంలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్‌ లు నిర్మించామని, దీంతో ఆటోలు తిరగడమే కష్టమైన నగర రోడ్ల మీద డబుల్‌ డెక్కర్‌ బస్సు తిరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. వినాయక సాగర్‌ విస్తరణ కూడా మన ప్రభుత్వమే నిర్వహించిందన్నారు. శెట్టిపల్లిలో త్వరలో ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సెక్షన్‌ 22ఏ కింద యాభై ఏళ్లుగా తిరుపతి ప్రజల ఎదుర్కొంటున్న 7వేల మందికి ఇళ్ల స్థలాల హక్కులకు భద్రత కల్పించామని, ప్రజా సంక్షేమాన్నికి కషి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌, మేయర్‌ డాక్టర్‌ శిరీష, కార్పొరేటర్లు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.