ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి దానమ్మ అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక వసతులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. పంచాయతీలో ప్రజలు ఎందుర్కొంటున్న విద్యుత్, ఉపాధి, మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచుల ఎదుట వారి వెంట తెచ్చుకున్న సమాచారాన్ని చదివి వినిపించారు. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ ఒక్క అధికారీ సమావేశం దృష్టికి తీసుకు రాలేదు. మండలంలో, మండల కేంద్రంలో చిన్నారులు, మధ్య వయస్కులు జ్వరంతో బాధపడుతున్నారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎవరూ స్పందించకపోవడం విచారకరం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై, వాటిని పరిష్కరించేలా సమావేశాలు ఉండాలి. నామమాత్రంగా నిర్వహించడం ఎందుకని ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహశీల్దార్ సమాధానం ఇస్తూ... కోర్టులో పిటిషన్ వేశామని, కోర్టు సూచనల మేరకు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. నీరు పరిశుభ్రంగా ఉండేలా, గ్రామంలో ట్యాంకుల ద్వారా మంచినీటిని అందించే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. గత మూడు సర్వసభ్య సమావేశాల నుంచి సమస్యలను అధికారుల ముందు పెట్టినా పరిష్కరించలేదని మండిపడ్డారు. పెద్దహరివాణం పిహెచ్‌సిలో కాన్పులు జరగడం లేదని సర్పంచి రాము నిలదీశారు. పిహెచ్‌సిలో సిబ్బంది కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి, వెళ్లి పోతున్నారని, కనీసం నెలకు ఐదు కాన్పులు కూడా జరగడం లేదని అధికారులను నిలదీశారు. ఒకపక్క మండల సమావేశం జరుగుతుంటే హనవాల్ ఎంపిటిసి మెల్లగా నిద్రలో జారుకున్నారు. నెట్టెకల్ సర్పంచి రామాంజి గ్రామంలో జగనన్న లే అవుట్లపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారని విలేకరిపై చిందులేశారు. ఎంపిడిఒ గీతావాణి కలుగజేసుకొని జగనన్న లేఅవుట్లపై సమాధానం ఇచ్చారు. కొన్ని శాఖల అధికారులు సమావేశానికి గైర్హాజరు కావడంతో ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మైనర్ ఇరిగేషన్ శాఖ, ఐసిడిఎస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో అధికారులు, ఐకెపి తదితర మండల శాఖ అధికారులు హాజరు కాలేదు. తహశీల్దార్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.










