Jul 27,2023 20:18

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో చర్చించి పరిష్కార వేదికగా ఉండాల్సిన కౌన్సిల్‌ సాదాసీదాగా సాగి ప్రాధాన్యత కోల్పోతోంది. సమావేశాలను నామమాత్రంగా నిర్వహిస్తూ సంతకాలకే పరిమితం చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఛైర్మన్‌ శాంత అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం జరిగింది. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం కోరం లేక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కౌన్సిల్‌లో ఎన్నడూ లేనివిధంగా 63 అంశాలను అజెండాలో పొందుపరిచి ఆమోదానికి ఉంచారు. అందులో 1, 2, 24, 42 అంశాలను మాత్రమే సభ్యులు తిరస్కరించారు. అంతకుముందు 1వ వార్డు కౌన్సిలర్‌ పార్వతి మాట్లాడుతూ... పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా రాంజల చెరువులో నిల్వ ఉన్న నీటిని సరఫరా చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న నీటిని బయటకు పంపి ఎల్‌ఎల్‌సి నుంచి కొత్తగా ట్యాంకును నింపితే సౌకర్యంగా ఉంటుందని సభ దృష్టికి తెచ్చారు. సమస్యను కలెక్టర్‌కు విన్నవించామని, ఆమోదం రాగానే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఇంజినీర్‌ నాగభూషణం రెడ్డి వివరించారు. కౌన్సిలర్‌ బాలాజీ మాట్లాడుతూ... వార్డుల్లో ఇంజినీర్‌ అసిస్టెంట్లు తమ ప్రమేయం లేకుండానే ఆధునీకరణ పనులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే, ఛైర్మన్‌, కౌన్సిలర్‌ నేమ్‌ ఫోన్‌ నెంబర్లు ఉండేలా బోర్డు అమర్చాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కౌన్సిలర్లను పిలువకుండా అవమానిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సమస్యలను కౌన్సిలర్లకు తెలియకుండానే ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తమను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. వీధిలైట్లు వచ్చినా తమ వార్డులో వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ కృపాకర్‌ మాట్లాడుతూ... వీధిలైట్లు పూర్తిస్థాయిలో రాలేదని, వచ్చిన వెంటనే వార్డులు వారీగా అమరుస్తామని తెలిపారు. కౌన్సిలర్‌ రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ... తమ వార్డులో సబ్‌ కలెక్టర్‌ పర్యటించిన విషయం తమకు తెలియలేదని అన్నారు. సుమారు రూ.3 కోట్లతో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజేయకుండా మరుగున ఉంచడం ఏమిటని నిలదీశారు. లక్షలాది రూపాయలు వెచ్చించి వాకీటాకీలు కొనుగోలు చేశారని, అవి నిరుపయోగంగా మారాయని కౌన్సిలర్లు అధికారులకు విన్నవించారు. టిడ్కో గృహాల తాళాలు అందజేసిన విషయం తమకు తెలియదని కౌన్సిలర్‌ బాలాజీ వాపోయారు
కౌన్సిలర్‌ను బుజ్జగించిన కమిషనర్‌
కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ... వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కౌన్సిలర్లను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. జగనన్న కాలనీలో రూ.50 కోట్లతో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, త్వరలోనే కౌన్సిలర్లను అక్కడికి తీసుకెళ్లి చూపిస్తామని చెప్పారు. ఎవరినీ కించపరిచే విధంగా వ్యవహరించేది లేదని తెలిపారు. పట్టణంలో జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దశలవారీగా అభివృద్ధి పరుస్తూ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మున్సిపల్‌ ఇంజినీర్‌ నాగభూషణం రెడ్డి మాట్లాడుతూ... భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంలో సుమారు 50 టిఎంసిల నీటి నిల్వ ఉందని అక్కడి అధికారులు తెలిపారన్నారు. రెండు, మూడు రోజుల్లో ఎల్‌ఎల్‌సికి నీరు వదిలే అవకాశం ఉందన్నారు. ఆ నీటిని ఎస్‌ఎస్‌ ట్యాంకుకు మళ్లించి పట్టణ వాసులకు తాగునీటి ఎద్దడి రాకుండా చూస్తామన్నారు.
కమిషనర్‌ను అభినందించిన కౌన్సిలర్లు : పట్టణంలో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కుళాయిలకు కనెక్షన్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారని కౌన్సిలర్లు అభినందించారు. కుళాయి లేకున్నా వేలాది రూపాయలు పన్ను వచ్చేదని, పరిశీలించి వాటిని రద్దు పరచడం వల్ల సంబంధిత వ్యక్తులు హర్షిస్తున్నారని, ఇందులో కమిషనర్‌ రఘునాథ్‌ రెడ్డి ప్రత్యేక చొరవ అభినందనీయమని కొనియాడారు. కౌన్సిలర్లు సందీప్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, చిన్న, చలపతి, అశోక్‌, ఉస్మాన్‌, వసీం, ఇంతియాజ్‌, ఫయాజ్‌, శాంతి, లోకేశ్వరి, ప్రతిభ, లక్ష్మీదేవి, ఇందు, మున్సిపల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ రెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీనివాసులు, అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, డిప్యూటీ ఇంజినీర్లు చలపతి రెడ్డి, రాజు నాయక్‌, రాజశేఖర్‌ రెడ్డి, కృపాకర్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ హరినాథ్‌ ఉన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్‌ పార్వతి
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్‌ పార్వతి