ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెల్లరేషన్‌కార్డు ఉన్న వారందరికీ నవంబరు 1 నుంచి కందిపప్పు సరఫరా చేస్తామని పౌరసరఫరాలశాఖ కమిషనరు అరుణ్‌కుమార్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కందిపప్పు నిల్వలు సరిపడా లేకపోవడం, జాతీయ స్థాయిలో కొరత కారణంగా నాలుగు నెలలుగా పూర్తిస్థాయిలో కార్డుదారులకు పంపిణీ చేయలేకపోయామని వివరించారు. హెచ్‌ఎసిఎ హైదరాబాద్ సౌజన్యంతో కార్డుదారులకు కంది పప్పును కిలో రూ.67 చొప్పున పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. నవంబరు నుంచి కందిపప్పు పంపిణీ ప్రతినెలా కొనసాగిస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాలు, పట్టణ, గ్రామాల్లోని రేషన్ షాపులకు ఈ నెల 31లోపు కందిపప్పును సరఫరా చేస్తామన్నారు. జనవరి నుంచి ఎపిఎస్‌సిఎస్‌సిఎల్ విజయవాడ రైతుల నుంచి కందులు మార్కెట్ ధరకు సేకరిస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏమైనా సమస్యలుంటే 1967 టోల్‌ఫ్రీ నెంబరుకు తెలియజేయాలని కోరారు.










