ప్రజాశక్తి- దేవనకొండ
కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్న గత ఎస్పీ ఆకె రవికృష్ణ కృషితోనే గ్రామం అభివృద్ధి చెందిందని ఎస్‌ఐ భూపాలుడు, వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున తెలిపారు. బుధవారం కప్పట్రాళ్ల గ్రామంలోని కల్యాణ మండపంలో రవికృష్ణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్‌ఐ భూపాలుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా 20 మంది కప్పట్రాళ్ల యువత రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామంలో తానా స్త్రీశక్తి భవన్, జిల్లా పరిషత్ హై స్కూల్, కల్యాణ మండపం, వాటర్ ప్లాంట్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు తదితర వాటిని ఏర్పాటు చేసిన ఘనత రవి కృష్ణదేనని తెలిపారు. గ్రామంలో రోడ్లు, నీటి వసతిని ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేశారన్నారు. కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ వీడి అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నందుకు సంతోషించాలని కోరారు. ఆయన ఆశలకనుగుణంగా గ్రామంలోని విద్యార్థులు, యువత బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గత ఎస్పీ ఆకె రవి కృష్ణ వర్చువల్‌గా కప్పట్రాళ్ల ప్రజలతో, మహిళలతో, విద్యార్థులతో మాట్లాడారు. త్వరలో గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. సే ట్రీస్ సంస్థ వారు రైతులకు ఇస్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కలను బాగా పెంచుకొని లాభాలు ఆర్జించాలని కోరారు. ప్రోగ్రాం మేనేజర్ బి.నారాయణ, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంతి, ఎంపిపి స్కూల్ ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, ఎంపిటిసి రూపమ్మ, చింతమాను రవికుమార్, కౌలయ్య, చిన్న లాలప్ప, కె.రాజు, చింపిరన్న, గొర్ల సుంకన్న, మహాలింగడు పాల్గొన్నారు.
రవికృష్ణ పుట్టినరోజు వేడుకల్లో కప్పట్రాళ్ల గ్రామస్తులు










