Jan 29,2021 15:11

గంటకు పన్నెండొందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రవాణా వ్యవస్థ హైపర్‌లూప్‌ కొత్త రూపు సంతరించుకుంది. దీనికి సంబంధించిన బోగీలను కూడా కొత్తరకం టెక్నాలజీతో అధునాతనంగా తీర్చిదిద్దింది. తాజాగా వీటికి సంబంధించిన డిజైన్‌ను విడుదల చేసింది. ఇందులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఒకటైతే.. సహజ వెలుతురును ప్రతిబింబించేలా 'ఆర్టిఫిషియల్‌ స్కైలైట్‌ మరొకటి. ఈ బోగీల్లో సుమారుగా 28 మంది కూర్చొని ప్రయాణించవచ్చు. కొన్ని నెలల క్రితమే భారతీయ ఇంజనీర్‌ తనరు మంజ్రేకర్‌ హైపర్‌లూప్‌లో ప్రయాణించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ బోగీలు శూన్యంతో కూడిన గొట్టాల్లో అయస్కాంత క్షేత్రాలపై తేలియాడుతూ వెళ్లే హైపర్‌లూప్‌ బోగీలు అందుబాటులోకి రావడానికి ఇంకొన్నేళ్లు సమయం పడుతుంది.
త్వరలో వాణిజ్యస్థాయి వినియోగం
ఈ హైపర్‌లూప్‌లో ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు కారు ప్రయాణానికి దాదాపు సమానంగా, విమాన చార్జీలకంటే తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. గంటల సమయం పట్టే ప్రయాణాలను నిమిషాల్లో పూర్తి చేయగలిగితే సమయం ఆదా అవుతుందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ చైర్మన్‌, డీపీ వరల్డ్‌ సీఈవో సుల్తాన్‌ బిన్‌ సులాయెం తెలిపారు. హైపర్‌లూప్‌ టెక్నాలజీ సామర్థ్యాన్ని తాము ఇప్పటికే ప్రపంచానికి తెలిపామని, అతి త్వరలో వాణిజ్యస్థాయి వినియోగమూ మొదలవుతుందని ఆయన వివరించారు. ముంబై నుంచి పుణేకు ఉన్న దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని హైపర్‌లూప్‌లో అరగంటలో ముగించవచ్చునని వర్జిన్‌ హైపర్‌లూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ ఇండియా) హర్జ్‌ ధలీవాల్‌ తెలిపారు. మహారాష్ట్రతోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో హైపర్‌లూప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు.