వాషింగ్టన్ : అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కంపెనీ కోవిడ్ వ్యాక్సినేషన్ పాలసీని పాటించని ఉద్యోగులపై వేటు తప్పదని గూగుల్ హెచ్చరించింది. అలాంటి ఉద్యోగులకు జీతాల్లో కోతలుంటాయని, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే గూగుల్ యాజమాన్యం సిబ్బందికి మెమో జారీ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం తెలిపింది. ఇటీవల చాలా టెక్ కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి ఆఫీసులకు రప్పిస్తుండగా... గూగుల్ మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ హోం నే కొనసాగిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ భయాందోళన వేళ.. మరికొద్ది రోజులు ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని గూగుల్ నిర్ణయించింది. అయితే వ్యాక్సిన్ పాలసీని మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
వారికి చివరి అవకాశం...
గూగుల్ మెమోలో సూచించిన ప్రకారం... డిసెంబరు 3లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్ స్టేటస్‌ను ప్రకటించి, అందుకు సంబంధించిన సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ వైద్యపరమైన లేదా మతపరమైన కారణాలతో టీకా నుంచి మినహాయింపు కావాలని ఎవరైనా అనుకుంటే దానికోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సూచనల మేరకు... డిసెంబర్ 3వ తేదీలోగా వ్యాక్సినేషన్ స్టేటస్‌ను అప్‌లోడ్ చేయని ఉద్యోగులు, ఇంకా టీకా తీసుకోనివారు, మినహాయింపునకు అనుమతిరాని సిబ్బందిని ప్రస్తుతం గూగుల్ కాంటాక్ట్ చేస్తోంది. వారందరికీ చివరి అవకాశం కల్పిస్తున్నట్లు గూగుల్ ఆ మెమోలో స్పష్టం చేసింది.
బైడెన్ ప్రభుత్వ ఆదేశాలు..
బైడెన్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... 100 మంది సిబ్బందికి పైగా ఉన్న అమెరికా కంపెనీలన్నీ జనవరి 18 లోగా తమ ఉద్యోగులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలి. దీనిపై ఫెడరల్ కోర్టు స్టే ఇచ్చింది. అయినప్పటికీ గూగుల్ మాత్రం బైడెన్ ఉత్తర్వులను తప్పకుండా అమలు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజా మెమోను జారీ చేసింది.
రూల్స్ పాటించకపోతే...
వచ్చే ఏడాది జనవరి 18 నాటికి గూగుల్‌లోని ప్రతి ఒక్కరూ కంపెనీ వ్యాక్సినేషన్ రూల్స్‌ను పాటించాలని సంస్థ స్పష్టం చేసింది. అప్పటికీ రూల్స్ పాటించని ఉద్యోగులను 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులో పంపిస్తామని, ఆ తర్వాత ఆరు నెలల వరకు 'వ్యక్తిగత సెలవు'లిచ్చి ఆ తర్వాత విధుల నుంచి తొలగిస్తామని గూగుల్ హెచ్చరించినట్లు సదరు మీడియా కథనం వెల్లడించింది. అయితే ఈ కథనంపై గూగుల్ అధికార ప్రతినిధి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.










