రూ.25 లక్షల పక్కా బిల్డింగ్ హాం'ఫట్'
అధికారులుతో అక్రమార్కుల కుమ్మక్కు
ప్రజాశక్తి - చిన్నగొట్టిగల్లు
రాజకీయ నాయకుల అండదండలు, అవినీతి అధికారుల ఆశీస్సులు అక్రమార్కులకు వరంగా మారింది. ప్రభుత్వ ఆస్తుల వివరాలు అక్రమార్కులిచ్చే కాసులకు కక్కుర్తి పడి కొంతమంది అధికారులు ఉప్పందిస్తున్నారు. అదును చూసుకొని ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా మింగేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసెలు వేస్తే సవాలక్ష చట్టాలు, సెక్షన్ లతో సహా వల్లించి గుడిసెలు పీకేసే అధికారులు పెత్తందార్ల జోలికి మాత్రం వెళ్ళడం లేదు. తమ రాజకీయ పలుకుబడి, బలగాన్ని వినియోగించి ప్రైవేటు ఆస్తులను కూడా కంచెలేసి చంపేస్తామని బెదిరించి నీ చేతనైంది. చేసుకో అని సవాలిసురుతున్న సంఘటనలు మండలంలో కోకొల్లలు. ఫిర్యాదు చేసినా తమకేమి తెలియదన్న చందంగా వ్యవహరిస్తున్న సంఘటనలతో పలు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం పై ప్రజల్లో నమ్మకం నానాటికి సన్నగిల్లుతోంది. బెదిరింపులు దౌర్జన్యం, అంగ బలం ,అర్థ బలం, పలుకుబడే పెట్టుబడిగా గ్రామ స్థాయి చోటామోటా నాయకులు సైతం పల్లెల్లో దొరికిన కాడికి దోచేస్తున్నారు. సామాన్యులు వీరు చేస్తున్న ఆగడాలను చోద్యం చూడడం తప్ప ఎదిరించే ధైర్యం సాహసం చేయలేక నిట్టూర్పు విడుస్తున్నారు. కరెక్టుగా ఇటీవల స్థానిక దీదాంర్లపల్లి పంచాయితీ గోటూరువాండ్లపల్లిలో జరిగిన పక్కా బిల్డింగ్ మాయం ఇందుకు అద్దం పడుతోంది.
గోటూరువాండ్లపల్లిలో వున్న రూ.25లక్షల విలువచేసే పక్కా బిల్డింగ్‌పై స్థానిక నాయకుడి కన్ను పడింది. అనుకొన్నదే తడవుగా కొంత మంది అధికారులతో విచారించి వివరాలు సేకరించినట్టు సమాచారం. ఎలాగైనా కాజేసి సొమ్ము చేసుకోవాలని కొంతమంది అధికారులతో కలిసి స్కెచ్ కి రూపకల్పన చేసుకొన్నాడు. ఓ శుభముహూర్తాన అమలుకు రంగం సిద్దం చేసుకొన్నాడు. అదును చూసుకుని విలువైన ఆ పక్కా బిల్డింగ్‌ను రాత్రికి రాత్రి ధ్వంసం చేసి అందుకు వినియోగించిన కట్రాయి, టేకు కిటికీలు, ద్వారబంధనాలు, అందులో వున్న విలువైన వస్తువులు మాయం చేసిన సంఘటన మండలంలో సంచలనంగా మారింది. ఇది తెలుసుకొన్న గోటూరువాండ్లపల్లి నివాసి ఎంపిడిఓకు ఆ పక్కా బిల్డింగ్ ప్రభుత్వానిదా?ప్రైవేటుదా?తేల్చండని ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయింది. రోజులు గడిచిపోతున్నా ఎంపిడిఓలో స్పందన కరువయ్యింది. కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈవిషయమై ఎంపీడీవో ను వివరణ కోరగా ఎంఈఓను అడగాలని ఆయన శాఖకూ సంబంధం వుందని, అవసరమైతే గోటూరువాండ్లపల్లికి వెళ్ళి పరిశీలించి విచారిస్తామని, సంబంధిత అక్రమార్కునికి వార్నింగ్ కూడా ఇచ్చానని తెలపడడంతో వార్నింగ్ అంటే వదిలేస్తున్నారా అని 'ప్రజాశక్తి' అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. ఈవిషయం ఎంఈఓకు ఏమి సంబంధమో అదికారులకే ఎరుక. తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రభుత్వం పై ప్రజల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి భరోసా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.










