Oct 07,2023 21:36

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ :  మండలంలో పలు గ్రామాల్లో జల జీవన్‌ మిషన్‌ ద్వారా శనివారం సుమారు రూ.1.25 కోట్లతో చేపట్టే పనులకు ఎమ్మెల్యేల అలజంగి జోగారావు శంకుస్థాపనలు చేశారు. చిన్నబొండపల్లిలో రూ.63 లక్షలతో, ములగలో రూ.46 లక్షలతో, గంగాపురం పంచాయతీలో రూ.15 లక్షలతో ఇంటింటి కొళాయి నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. గ్రామాల్లో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ పనులు చేపడుతున్నామని చెప్పారు.
మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మండలంలోని పెద్దబొండపల్లి తామర చెరువులో చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి ఎం.శోభారాణి, సర్పంచులు సవరపు తవుడమ్మ, సతీష్‌ కుమార్‌ సూర్యనారాయణ, మత్స్యసహకార సంఘాల అద్యక్షులు, జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య, పార్వతీపురం ఫిషరీస్‌ అధికారి వై.శ్రీదేవి, గ్రామ సహాయకులు సరళ లలిత, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
గుడారివలసకు రహదారి నిర్మించాలి
అడారు పంచాయతీ గుడారువలసకు రహదారిని నిర్మించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు తాడంగి సాయిబాబు శనివారం ఎమ్మెల్యే అలజంగి జోగారావును కలిసి వినతి అందించారు. ఎమ్మెల్యే స్పందించి బుధవారం ఆడారు పంచాయతీని అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శించి, సమస్య పరిష్కారిస్తానని హామీనిచ్చారు.