ప్రజాశక్తి-సాలూరు : పట్టణంలోని పెద్దాస్పత్రిలో పేద రోగులకు భోజన కష్టాలు తప్పడం లేదు. వందపడకల ఆస్పత్రి అయిన తర్వాత రోగుల తాకిడి పెరిగింది. సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రాంతీయ ఆస్పత్రి స్థాయికి చేరడంతో నిపుణులైన వైద్యులు ఇక్కడ నియామకమయ్యారు. సేవలు బాగుండటంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆస్పత్రిలో పడకల సంఖ్య పెంచినా వసతి సమస్యగా ఉండడంతో ఒకే మంచంపై ఇద్దరు రోగులను ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఆస్పత్రిలో వైద్యం కోసం చేరిన రోగులు, వారి వద్ద ఉండే సహాయకులకు భోజనం సరఫరా అవుతోంది. గతంలో ఒక్కో రోగికి భోజనం నిమిత్తం ప్రభుత్వం రోజుకు 40 రూపాయల చొప్పున మంజూరు చేసింది. ఇప్పుడు దానిని 72 రూపాయలకు పెంచింది. ఇప్పుడున్న నిత్యావసర సరుకుల ధరల ప్రకారం చూస్తే పెంచిన మెనూ రేటు కూడా తక్కువే అవుతుంది. మెనూ రేటు పెంచినా రోగులకు అందుతున్న ఆహారం నాణ్యతలో పెద్దగా తేడా కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భోజనంలో ప్రధానమైన అన్నం కోటా బియ్యంతో వండుతున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఆస్పత్రిలో ఉండే రోగులకు ఎంత నాణ్యమైన భోజనం పెడితే వారు అంత ఇష్టంగా తింటారు. కానీ మెనూ రేటు పెరిగినా కాంట్రాక్టరు నాణ్యతతో కూడిన భోజనం పంపిణీ చేయడం లేదని తెలుస్తోంది. భోజనంలో అరటి పండు చాలా చిన్నవి సరఫరా చేస్తున్నారు. దీంతో రోగులు గత్యంతరం లేని పరిస్థితుల్లో నాణ్యత లేని భోజమైనా తింటున్నారు. ఇక్కడ ఇన్ పేషెంట్లుగా చేరిన వారిలో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భోజనానికి సంబంధించి గత ఆరేడు నెలలుగా బిల్లులు మంజూరు చేయలేదన్న సాకుతో కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా రోగులకు నాణ్యతతో కూడిన భోజనం అందేలా చూడాల్సిన బాధ్యత స్థానిక ఆస్పత్రి వైద్యాధికారిపై ఉంటుందని పలువురు భావిస్తున్నారు.










