ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్: జిల్లా ప్రధాన కేంద్రంలోని ప్రధాన రహదారిలో దర్జాగా పశువులు సంచరిస్తుండడంతో వాటిని నియంత్రించేందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్ జె.రామ అప్పలనాయుడు పశువులు రహదారిపై సంచరిస్తే ఉపేక్షించేది లేదని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత యజమానులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగానే ఉంది. ప్రధాన రహదారిలో పశువులు సంచరించడమే కాక రోడ్లపై వాటి వ్యర్ధాలను చిందర వందర చేయడంతో కలుషిత వాతావరణం నెలకొంది. అలాగే పట్టణ ప్రధాన కూడళ్ల వద్ద అవి తిష్టవేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు, ఆయా కూడళ్లలో రాకపోకలు సాగించేందుకు పాదచారులు, వాహనచోదకులు అనేక ఇబ్బందులకు గురవ్వడమే కాక, పలు సందర్భాల్లో ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులు పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా వాటిని పెంపకం చేసే యజమానులకు ఏమాత్రం చీమకుటైన లేకపోవడం గమనార్హం. జిల్లా కొత్తగా ఏర్పాటైన అనంతరం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నిశాంత్ కుమార్ జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణంలో పర్యటించిన సమయంలో ప్రధాన రహదారి పైనే పశువుల సంచారం ఉండడం గమనించి మున్సిపల్ అధికారులకు వాటిని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టమని అప్పటిలోనే ఆదేశాలు జారీ చేశారు. అయినా ప్రధాన రహదారిపై పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టకపోవడం అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటి సంచారాన్ని ప్రధాన రహదారిపై నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.










