రోడ్డుపై బురద లేకుండా చూడాలి :ఎమ్మెల్యే
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం దళితవాడలో ఇటీవల మరణించిన తిరివీధి ఏసు కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఒక రోడ్డుపై బురద ఉండటం, దానిలోనే జనాలు నడపడం గమనించారు. వెంటనే కారు రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగారు. ఫోన్ తీసి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శికి ఫోన్ చేసి వెంటనే దళితవాడకు రమ్మని ఆదేశించారు. అధికారులు పుటాహుటీన అక్కడకు వెళ్ళగా బురదమయంగా మారిన రోడ్డు చూపించి గన్నవరం పట్టణంలో ఈ విధంగా రోడ్డు ఉంటే స్థానికంగా ఉన్న ప్రజలు ఏ విధంగా రాకపోకలు సాగిస్తారని ప్రశ్నించారు. తక్షణమే కంకర డస్ట్ బురద కనపడకుండా రోడ్డుపై పరచాలని ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే చేయిస్తామని చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో వంశీ ముందుంటారని దీనినిబట్టి రుజువైందని దళితవాడకు చెందిన పెద్దలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.










