ప్రజాశక్తి-యర్రగొండపాలెం
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ గుంతల రోడ్డులో నిత్యం ఆరు గ్రామాల ప్రజలు తమ అవసరాల నిమిత్తం తిరుగుతుంటారంటే నమ్మశ క్యంగా లేదుకదూ.. కాని ఇది సత్యం. యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల-గుర్రపుశాల-గంజివారిపల్లె వెళ్లే మార్గాన ఉన్న రోడ్డు దుస్థితి ఇది. 10 కి.మీ పొడవు ఉన్న ఈ రోడ్డును బాగు చేయమని పాలకులు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించి విసిరివేశారిపోయామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడి తారు రోడ్డు అన్న ఆనవాలు కూడా మట్టి రోడ్డులా మారిపోయింది. ఇలా గుంతలమయమై ఉన్న రోడ్డున ప్రయాణం సాగించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని పలువురు వాహనచోదకులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గుంతలమయమై ఉన్న రోడ్డు మీద వాహనాలు నడపడం వల్ల తరచూ తమ వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని, ఒకానొక సమయంలో గుంతల్లో పడి చిన్న పాటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు దృష్టి పెట్టి గుంతలైన పూడ్చి కనీస మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.










