రోడ్డు, కాలువల్లేని దళితవీధి
ప్రజాశక్తి-వీరఘట్టం : తమ వీధిలో రోడ్డు వేస్తేనే రాబోయే ఎన్నికల్లో ఓటు వేస్తామని వీరఘట్టంలోని బాబూ జగ్జీవన్‌రాం కాలనీ దళితులు స్పష్టంచేశారు. శనివారం స్థానిక విలేకరుల వద్ద తమగోడు వెలిబుచ్చారు. అన్ని వీధుల్లో సిసి రహదారులు, కాలువలు నిర్మిస్తున్నా.. తమ వీధి వరకు వచ్చేసరికి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామానికి చివర్లో ఉన్నందున కాలువ లేకపోవడంతో పైనుంచి వచ్చే నీరు ఎటూ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో నిల్వ ఉండిపోతోందని తెలిపారు. దీనివల్ల దోమల ప్రభావంతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రోడ్డు, కాలువలు నిర్మించాలని కోరారు.










