May 29,2023 22:52

సమస్యను కమిషనర్‌కు వివరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పట్టణంలో ఆర్‌పిజిటి రోడ్డు పేరును మార్చొద్డని వివిధ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నెల 31న జరిగే మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆర్‌పిజిటి, దండు రోడ్డును ఈద్గా రోడ్డుగా మార్చుతు అజెండాలో పొందు పరిచారు. ఈ విషయం తెలుసుకున్న కొన్ని సంఘాల వారు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, తహశీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఈ తరహా చర్యల వల్ల అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి పేర్లను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.