ప్రజాశక్తి - ఆదోని
తల్లి, బిడ్డకు పౌష్టికాహారం అందజేసి రక్తహీనతను పారదోలే దిశగా కృషి చేద్దామని ఐసిడిఎస్ కార్యాలయ సూపరింటెండెంట్ శంకర్, పర్యవేక్షకులు లీలావతి తెలిపారు. బుధవారం ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మూడు నెలల్లోపు గర్భిణుల వివరాలను నమోదు చేసి కాన్పు అయిన ఆరు నెలల వరకు పౌష్టికాహారం ఇవ్వాలని తెలిపారు. వచ్చే నెల నుంచి గర్భిణీ, బాలింతలకు నెలకు మూడు కిలోల బియ్యం, కిలో కంది పప్పు, అర లీటర్ వంటనూనె, 25 కోడిగుడ్లు, ఐదు లీటర్ల పాలు ఇస్తున్నట్లు చెప్పారు. కాన్పు అయిన మహిళకు వైఎస్‌ఆర్ కిట్టు పేరుతో రాగి పిండి రెండు కిలోలు, కిలో గోధుమపిండి, కిలో జొన్న పిండి, పావు కిలో ఖర్జూరం, కిలో బెల్లం ఇస్తున్నామన్నారు. ప్రతి గర్భిణీకీ రక్తం 12 గ్రాములు తగ్గకుండా ఉండాలని తెలిపారు. మొదటి నుంచి కాన్పు జరిగే సమయంలో గర్భిణీ 8 నుంచి 10 కిలోల బరువు పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తల్లి బలంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
అవగాహన కల్పిస్తున్న లీలావతి










