Aug 29,2023 19:51

సమావేశంలో మాట్లాడుతున్న గురు శేఖర్‌

ప్రజాశక్తి - దేవనకొండ
రజకుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహిస్తామని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి.గురుశేఖర్‌ తెలిపారు. మంగళవారం దేవనకొండలో ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం సమావేశం నిర్వహించారు. కబీర్‌ అధ్యక్షత వహించారు. గురుశేఖర్‌ ముఖ్యఅతిథిగా హాజరయి మాట్లాడారు. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రజకులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రజక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఛైర్మన్‌, డైరెక్టర్లు, బోర్డు నియమించినా కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రజకుల పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందని తెలిపారు. చెరువులపైన రజకులకే పూర్తి హక్కు ఉండాలని, దేవాలయాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ధోబి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. 50 ఏళ్లు నిండిన రజకులకు పింఛన్లు ఇవ్వాలని, రజకుల భద్రత కోసం సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పట్టణ, మండల కేంద్రాల్లో మోడరన్‌ ధోబీ ఘాట్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అర్హులైన రజకులకు ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రతి ఇస్త్రీదారునికీ 250 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కోరారు. అలాగే అపార్ట్‌మెంట్‌ వాచ్‌మేన్‌ కమ్‌ ఇస్త్రీదారులకు కనీస వేతన చట్టం అమలు జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌లో జిల్లాలోని మండలాల్లో రజకుల సమస్యలపై అధ్యయన బృందాలుగా ఏర్పడి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కమిటీ సభ్యులు కోటకొండ సూరి, మండల నాయకులు వీరేష్‌, నరసింహులు, సుంక్కన్న, గోపి పాల్గొన్నారు.