అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.గౌతమి అధికారులకు సూచించారు. విజయవాడ సిసిఎల్‌ఎ కార్యాలయం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం, రీసర్వే ప్రక్రియ, ఇతర అంశాలపై కలెక్టర్‌లు, జాయింట్ కలెక్టర్లతో సిసిఎల్‌ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతపురం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్‌ఛార్జి డిఆర్‌ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.శ్రీనివాసులు, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లానాయక్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశలో 43 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి కాగ, ఆయా గ్రామాల్లో పాసు పుస్తకాలు పంపిణీ జరిగిందన్నారు. స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యిందన్నారు. రెండవ దశలో 57 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియను చేపట్టినట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో రీసర్వే పనులు వేగంగా చేపట్టాలన్నారు. నిర్దేశిత గడువులోగా రీసర్వే కింద అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు.










