రీ సర్వేను పూర్తి చేయండి
ప్రాధాన్యత భవన నిర్మాణాలు వేగవంతం చేయాలి
- రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రెండవ విడతలో చేపట్టిన రీ సర్వే పనులను పకడ్బందీగా త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. శనివారం అమరావతిలోని సిఎస్ కార్యాలయం నుంచి స్పెషల్ సిఎస్, సిసిఎల్‌ఏ సాయి ప్రసాద్, వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి రెండవ దశ భూహక్కు, రీ సర్వే, ప్రాధాన్యత భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి ఆయా అంశాలలో ప్రగతి సాధనకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జెసి నిశాంతి.టి, డిఆర్‌ఒ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో రెండవ దశ రీ సర్వే పకడ్బందీగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన దశల వారి ప్రక్రియలను ఆయా కాలపరిమితిలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్, వెక్టోరైజేషన్, విలేజ్ సెక్రటరీ, విఆర్‌ఒ, తాసిల్దారు, ఆర్డిఓ, జెసి లాగిన్‌లలో డేటా ఎంట్రీ పక్కాగా జరగాలన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్‌లో భాగంగా రెవిన్యూ రికార్డ్స్ మేరకు ప్రభుత్వ భూములను, ఎంజారుమెంట్ మేరకు పట్టా ల్యాండ్ భూములను పక్కగా రీ సర్వే చేయాలన్నారు. మొదటి దశ రీసర్వేలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని రెండవ దశను పటిష్టంగా పూర్తి చేయాలన్నారు. ల్యాండ్ కన్వర్షన్, ఆధార్ సీడింగ్, ఫొటోలు మిస్‌మ్యాచ్ అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో హద్దురాళ్లు నాటే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాల భవనాల నిర్మాణ పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నేటి నుండి ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలు, అర్హత ఉండి ఇంకా అందని ప్రభుత్వ పథకాల వివరాలు తెలుసుకొని సచివాలయం వద్ద సంబంధిత అంశంపై టోకెన్ వచ్చేలా ఏర్పాటు చేసి పథకాల లబ్ది అందేలా కృషి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్‌ఈ మనోహర్, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే ఎడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.










