రీ సర్వే పూర్తయిన 102 గ్రామాల్లో రాళ్లను పాతాలి : కలెక్టర్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
జిల్లాలో రీ సర్వే పూర్తయిన 102 గ్రామాల్లో ఈనెల 20వ తేదీలోగా సర్వే రాళ్లను పాతాలనీ, వెబ్ ల్యాండ్ డేటా వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి రీ సర్వే, భూ హక్కు పత్రాలు, స్పందన అర్జీల పరిష్కారం తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీ సర్వే పూర్తయిన 102 గ్రామాల్లో ఇప్పటివరకు 38,373 సర్వే రాళ్లను పాతారన్నారు. ఇంకా 36,074 సర్వే రాళ్ళను పాతించాల్సివుందన్నారు. వెబ్ ల్యాండ్ 2.0 డేటా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలన్నారు. భూహక్కు పత్రాలకు సంబంధించి 29వేలకు గాను ఇంకా పెండింగ్ లో ఉన్న 8వేల రికార్డులు త్వరగా పూర్తిచేసి భూ హక్కు పత్రాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో గ్రామాల వారీగా లంకల భూముల పంపిణీకి కూడా త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ అసైన్మెంట్ భూముల వివరాలను సిద్ధం చేయాలన్నారు. అనాధీన భూములను ఒకసారి పరిశీలించాలన్నారు. స్పందన అర్జీలు మళ్లీ రాకుండా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ చొరవతో 18,235 ఎకరాలను 22-ఏ-1-ఈ పరిధి నుంచి తప్పించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి ఆయా కుటుంబాలను ఆదుకున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖకు ఇటీవల రూ.5 కోట్ల ఆదాయం లభించిందన్నారు. జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.జిల్లా విభజన తర్వాత ఏడాది విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రశంసిస్తూ రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సర్వే భూ రికార్డుల ఏడి గోపాలరాజా, ఉయ్యూరు, గుడివాడ ఆర్డీవోలు విజయకుమార్, పద్మావతి, పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు










