ఇంఫాల్ : మణిపూర్‌లో అశాంతికి అధికార బిజెపి విద్వేషపూరిత రాజకీయాలే కారణమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రజలు ఒకరితో మరొకరు ఘర్షణ పడేలా చేసినపుడు ఏమి జరుగుతుందనే దానికి నిదర్శనం మణిపూర్‌లో హింసాకాండ అని అన్నారు. అస్సాంకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్‌లో రాహుల్ మణిపూర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. బిజెపి విద్వేషరాజకీయాలు మణిపూర్‌ను నాశనం చేశాయని మండిపడ్డారు. వాస్తవానికి అక్కడ మణిపూర్ లేదని, దానికి మళ్లీ జీవం పోయాల్సి ఉందని అన్నారు. బిజెపి రాజకీయాలే దోషి అని అన్నారు. హింసాత్మక పరిస్థితులను నియంత్రించడంలో అక్కడ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. రువాండలో అంతర్యుద్ధం ఉందని, కానీ భారతదేశంలో ఇటువంటి పరిస్థితులను ఊహించి ఉండమని అన్నారు. దీనికి పూర్తిగా బిజెపిదే బాధ్యతని, విద్వేషం ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.










