ప్రజాశక్తి-మార్కాపురం
మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో గుంతలమయమైన చెరువుకట్ట రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ మూడవ వార్డు ప్రజానీకం బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళనకు ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేశపోగు సుదర్శన్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు సమీపంలోని డ్రైవర్స్ కాలనీ ప్రజలు రోడ్డు నుంచి వస్తున్న దుమ్ము, దూళితో ఇబ్బంది పడుతున్నారన్నారు. రహదారిపై అడుగుకో గుంత ఏర్పడినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రహదారి నిర్మాణానికి ఎప్పుడో నిధులు మంజూరైనట్లు ఆర్‌అండ్‌బి అధికారులు చెబుతున్నారే తప్ప... నిర్మాణం మాత్రం చేపట్టలేదన్నారు. రహదారిపై ఏర్పడ్డ గుంతల కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని తెలిపారు. ఇదే మార్గంలో ఒంగోలు, పొదిలితో పాటు మార్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు ప్రయాణం చేయాల్సి ఉందని, నిత్యం వేలాది వాహనాలు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయని, ఇంతటి ప్రాధాన్యత కలిగిన రహదారిని అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. రాస్తారోకోతో రాకపోకలు నిలిచిపోవడంతో పట్టణ ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు, రెండవ పట్టణ ఎస్‌ఐ సువర్ణ, మార్కాపురం రూరల్ ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరనాయక్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాత్కాలికంగా రహదారిని మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.










