ప్రజాశక్తి - కురుపాం : స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద మంగళవారం ఎంపిడిఒ వివి శివరామప్ప ఆధ్వర్యంలో ఎంపిపి శెట్టి పద్మావతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాశక్తిలో ఇటీవల ప్రచురితమైన 'పాఠశాలలో తనిఖీలు జరిగేనా.. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందేనా' అన్న శీర్షికతో వెలువడిన కథనానికి సమావేశంలో చర్చ జరిగింది. మండల విద్యాశాఖ అధికారి తమ శాఖ ప్రగతిని వివరిస్తుండగా మండల కోప్సన్ సభ్యులు షేక్ జిలాని కలుగజేసుకొని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలానే లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం సరుకులు పక్కదారి పడుతున్నా యని, దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక ఇంటికి వచ్చి వెళ్తున్నారని అన్నారు. ఐసిడిఎస్ అధికారుల పర్యవేక్షణ లోపంవల్ల అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అందజేయాల్సిన సరుకులు సక్రమంగా అందకుండా బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్నాయని తెలిపారు. దీనివల్ల సిబ్బంది పర్యవేక్షణ లోపం లేకపోవడమే నని, కిశోర బాలికలకు, లబ్ధిదారులకు టేక్ హౌమ్ రేషన్ పంపిణీలో అవకతవకలపై మొండెంఖల్ సర్పంచ్ ఐ.గౌరీశంకర్, పలువురు సర్పంచులు ఐసిడిఎస్ సిబ్బందిని నిలదీశారు. ఎంపిపి శెట్టి పద్మావతి మాట్లాడుతూ అధికారులంతా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా అధికారులు చూస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. అలాగే ఐసిడిఎస్ సిబ్బంది కూడా పర్యవేక్షణ సక్రమంగా చేసి గర్భిణీలకు, బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హౌసింగ్ సిబ్బందికి ఆదేశించారు. అనంతరం కొత్త ఎన్నికైన గుమ్మ సర్పంచ్‌గా గెలుపొందిన ఆరిక గోపాలరావుచే ఎంపిడిఒ వివి శివరామప్ప ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జడ్పిటిసి జి.సుజాత, వైస్ ఎంపీపీలు అన్నాజీరావు, రంగారావు, ఎంపీటీసీలు, సర్పంచులు, కొందరు అధికారులు పాల్గొన్నారు.










