రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం
- 9 మంది తమిళ కూలీలు అరెస్ట్
ప్రజాశక్తి - రుద్రవరం
నంద్యాల-కడప జిల్లాల నల్లమల అటవీ సరిహద్దులో 9 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు రుద్రవరం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల డిఎఫ్‌ఒ వినీత్ కుమార్ ఆదేశాల మేరకు నంద్యాల డివిజన్, పొద్దుటూరు డివిజన్ ఫారెస్ట్ సరిహద్దులో ఉన్న చింతమాను రస్తా ప్రాంతంలో తమిళ కూలీలు ప్రవేశించారని సమాచారం అందడంతో ఫారెస్ట్ మొబైల్ సిబ్బంది, నూతల సిబ్బంది, అహౌబిలం, రుద్రవరం, డి, వనిపెంట అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వచ్చిన 9 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రెండు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పట్టుబడిన నిందితులను తిరుపతిలోని ఎర్రచందనం ప్రత్యేక కోర్టులో హాజరపరిచినట్లు తెలిపారు.










