ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్: కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి ధనికొండ నాగమల్లేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలలో భాగంగా మంగళవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు రూ లక్ష జీతం ఇచ్చినా తక్కువేనన్నారు. పారిశుధ్య కార్మికులు చేసే పని మరి ఎవరూ చేయలేరని చెప్పారు. అధికారం రాగానే ఆరు నెలల్లో పర్మనెంట్ చేస్తామని సిఎం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. జనాభాకు అనుకూలంగా కార్మికులకు కొత్తగా పని కల్పించాలన్నారు. 60 ఏళ్ళు నిండిన కాంట్రాక్ట్ కార్మికులను రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు తాడిశెట్టి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి జూటూరు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు రెడ్డి నాగబాబు, చరణ్ శెట్టి దుర్గ ప్రసన్నుడు, గిరిజన్, సుబ్బారావు, సిరంశెట్టి విజయ, సుబ్బలక్ష్మి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.










