
రేషన్‌లో 'కంది' పోయింది
- కందిపప్పు సరఫరా నిలిపివేత
- బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 200
- కొనలేకపోతున్న పేద, మధ్య తరగతి, సామాన్య ప్రజలు
ప్రజాశక్తి - చాగలమర్రి
నిరుపేదల ఇళ్లల్లో రేషన్ బియ్యం ఉంటే చాలు అన్నం వండుకుని గిద్దెడు కందిపప్పుతో పప్పుచారు కాసుకుంటే ఆ రోజు గడిచిపోతుంది. నిత్యవసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాక రేషన్ సరుకుల్లో బియ్యం తీసుకున్నా లేకున్నా పంచధార, కందిపప్పును పేద మధ్యతరగతి లబ్ధిదారులు క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. నెలలో అవి ఉన్నంతవరకు కొంత నిశ్చింతగానే కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుంది. వంటింట్లో అవి నిండుకున్నాయో బజార్లో కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పేదల భోజనానికి అంతగా ఉపయోగపడే కందిపప్పు పంపిణీకి గత మూడు నెలల నుంచి ప్రభుత్వం చెక్ పెట్టింది. బియ్యం, పంచదార మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.
నెల రోజుల కిందటి వరకు కందిపప్పు కిలో రూ.120 ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా రూ.200కి చేరింది. నంద్యాల జిల్లాకు ఎక్కువగా నాగపూర్ ప్రాంతం నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి కందిపప్పు సరఫరా అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పును ఒకేగుత్తేదారు సరఫరా చేస్తుంటారు. ప్రభుత్వం నుంచి గుత్తేదారుకు బిల్లులు చెల్లించడంలో జాప్యం ఓ కారణమైతే ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో కూడా సరుకు గిరాకీ పెరిగి ధరలు అమాంతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో మూడు నెలలపాటు ధర ఇలాగే ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చాగలమర్రి మండల వ్యాప్తంగా 15407 రేషన్ కార్డులు ఉన్నాయి. మండల పరిధిలో 11 ఎండియు వాహనాలు పని చేస్తున్నాయి. ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం వీటి సరఫరాలో చేతులు ఎత్తేయడంతో పేదలకు భారంగా మారింది. రేషన్ షాపుల ద్వారా కేజీ కందిపప్పు ప్యాకెట్ రూ.67 విక్రయిస్తారు. బయట మార్కెట్లో రూ.200 పలుకుతుండడంతో పేదలు బెంబేలెత్తిపోతున్నారు.
కందిపప్పు కొనాలంటే భయమేస్తుంది
- షంషాద్ బేగం, చాగలమర్రి
నిత్యం కూలి పనులకు వెళ్లి పూట గడుపుకుంటున్నాం. గత మూడు నెలలుగా ప్రభుత్వం రేషన్ కార్డులకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. రేషన్ షాపుల్లో కిలో ప్యాకెట్ ధర రూ. 67 విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం కిలో రూ. 200 పలుకుతుంది. కందిపప్పు కొనాలంటేనే భయం వేస్తుంది.
రేషన్ షాపుల ద్వారా కందిప్పు పంపిణీ చేయాలి
- షబానా బేగం, చాగలమర్రి
నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అల్లాడుతున్నాం. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా బయట మార్కెట్లో రూ 200 పెట్టి కందిపప్పు కొనుగోలు చేయాలంటే భారంగా మారింది. మూడు నెలల నుంచి కందిపప్పు సరఫరా చేయడం లేదు. ప్రభుత్వం స్పందించి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలి.










