Oct 10,2023 19:53

పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు

ప్రజాశక్తి - కౌతాళం
ప్రతినెలా 1వ తేదీ వచ్చిందంటే జీతాల కోసం ఎదురుచూసే ఉద్యోగులు ఉన్నారు. వారితోపాటు పింఛన్ల కోసం ఎదురుచూసే పెన్షన్‌ దారులూ ఉన్నారు. అంతకంటే ముఖ్యమైన రేషన్‌ బియ్యం కోసం ఎదురుచూసే పేదలు కూడా ఉన్నారు. ఈ నెల 1 నుంచి 15లోపు రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తి చేయాల్సి ఉంది. కౌతాళం మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో 48 చౌక దుకాణాల ద్వారా ప్రతినెలా 24,319 రేషన్‌ కార్డుదారులకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈనెల 10 దాటినా 50 శాతం బియ్యం పంపిణీ పూర్తి కాలేదు. సర్వర్‌ సమస్య తలెత్తడంతో గత నాలుగు రోజుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. సకాలంలో బియ్యం పంపిణీ కాకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. అనేక కుటుంబాలు ఈ రేషన్‌ బియ్యంపై ఆధారపడి ఉన్నాయి. బయట మార్కెట్‌లో బియ్యం కొనాలన్నా వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రజలు రేషన్‌ బియ్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.