Oct 20,2023 20:30

ముట్టడిలో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
ఆలూరు మండలం అగ్రహారం గ్రామంలో కార్డు దారులకు రేషన్‌ బియ్యం వేయాలని సిపిఎం సీనియర్‌ నాయకులు కెపి.నారాయణ స్వామి, మండల కార్యదర్శి షాకీర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో అగ్రహారం గ్రామస్తులు తహశీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆలూరు మండలం అగ్రహారం గ్రామంలో 20వ తేదీ కావస్తున్నా ఇప్పటి వరకు ప్రజా పంపిణీకి సంబంధించిన రేషన్‌ బియ్యం, ఇతర సరుకులు వేయలేదని మండిపడ్డారు. గ్రామంలోని 18వ రేషన్‌ షాపు సృజన కార్డుదారులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపారు. 'రేషన్‌ రాలేదు.. ఎవరికైనా చెప్పుకోండి' అని అనడం ఏమిటని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా రేషన్‌ తప్ప ఏ ఇతర సరుకులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే వర్షాలు లేక, పని దొరకక, ఏమీ చేయలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు రేషన్‌ను కూడా వేయలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్‌ అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పడానికే పరిమితం అయిందని విమర్శించారు. ప్రజాపంపిణీపై నిర్లక్ష్యం వహిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌, ఇతర సరుకులు వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫీల్డ్‌కు వెళ్లిన తహశీల్దార్‌ రావడంతో వినతిపత్రం అందజేశారు. తహశీల్దార్‌ స్పందిస్తూ... అగ్రహారం గ్రామంలో బ్యాక్‌లాగ్‌ బియ్యం ఉండడం వల్ల రేషన్‌ అలాట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు బియ్యాన్ని అలాట్‌మెంట్‌ చేయాలని కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చే వరకు పేదలను దృష్టిలో ఉంచుకొని ఇతర రేషన్‌ షాపుల బ్యాక్‌ లాగ్‌లో ఉన్న బియ్యాన్ని తెప్పించి సాయంత్రం 5 గంటల్లోపు పంపిణీ చేస్తామని వివరించారు. సిపిఎం నాయకులు గోవర్ధన్‌, గ్రామస్తులు చంద్ర, కృష్ణ, నాగరాజు, చెన్నమ్మ, సుంకమ్మ, నాగవేణి, వీరేష్‌ పాల్గొన్నారు.