ప్రజాశక్తి - ఆదోని
నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని, కార్పొరేట్ తరహాలో విద్యార్థులకు సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు ఊదరగొడుతూనే ఉన్నారు. ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆదోనిలోని విజయభాస్కర్ రెడ్డి కాలనీలోని ఎన్.రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్‌లో సౌకర్యాల్లేక విద్యార్థులు రేకుల షెడ్డులో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. 'జగన్ మావయ్య... ఒకే రూములో 106 మంది ఎలా ఉండాల'ని విద్యార్థులు వాపోతున్నారు.
పట్టణంలోని విజయ భాస్కర్ రెడ్డి కాలనీలో ఉన్న ఎన్.రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సౌకర్యాల్లేక రేకుల షెడ్డులోనే చదువులు కొనసాగిస్తున్నారు. కనీసం బాత్‌రూములు, టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని విద్యార్థులు వాపోతున్నారు. అసలే మురికివాడ కావడం వల్ల పేదలు, కూలీల కుటుంబాలకు చెందిన చిన్నారులే ఈ పాఠశాలకు వస్తున్నారు. పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో రేకుల షెడ్డులోనే పాఠాలు చెబుతున్నారు. గోడల్లో చీలికలు రావడంతో ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో వార్త పత్రికల్లో ప్రచురించగా స్పందించిన అధికారులు ఈ పాఠశాలకు నాడు-నేడు కింద శాశ్వత భవనం మంజూరు చేశారు. విద్యార్థుల సమస్యలను పలుమార్లు వెలికితీయగా అధికారులు స్పందించి నాడు-నేడు కింద భవన నిర్మాణానికి రూ.42 లక్షల నిధులు మంజూరు చేశారు. 106 మంది విద్యార్థులకు ఒకే గది నిర్మించడం వల్ల స్థలం చాలదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అక్కడ ఇంకా స్థలం మిగిలి ఉందని, అధికారులు మరికొన్ని గదులు నిర్మిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు. 106 మంది విద్యార్థులున్న పాఠశాలకు ఒకే గది నిర్మించడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆగిన నిర్మాణం
పాఠశాలలో నాడు-నేడు కింద అద్భుతంగా పని చేయిస్తున్న ప్రధానోపాధ్యాయులును డిప్యూటేషన్‌పై పంపడంతో ఆ పనులు కూడా ఆగిపోయాయి. మున్సిపల్ అధికారులు, ఆదోని ఎంఇఒ మేల్కొని నూతనంగా నిర్మిస్తున్న ఎన్.రామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో మరిన్ని గదుల నిర్మాణం చేపట్టాలని, ప్రస్తుతం ఉన్న రేకుల షెడ్డు కూడా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నందున విద్యార్థులను సురక్షితమైన ప్రదేశానికి మార్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నాడు-నేడు కింద జరుగుతున్న పనులకు ఆటంకం కలుగకుండా ఇక్కడ విధులు నిర్వర్తించే ప్రధానోపాధ్యాయులును తిరిగి నియమించాలని కోరుతున్నారు.
పనులకు ఆటంకం కలుగకుండా చర్యలు
- ఎంఇఒ శివరాములు
ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు లేబర్ కాలనీ మున్సిపల్ హైస్కూల్‌కు తాత్కాలికంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులును సబ్జెక్టు టీచర్‌గా కేటాయించాం. పనులకు ఆటకం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. సర్దుబాటు పూర్తికాగానే ప్రధానోపాధ్యాయులును తిరిగి అక్కడికే పంపుతాం.










