Aug 22,2023 22:14

విద్యార్థుల పాఠాలు బోధిస్తున్న కవి గంటేడ గౌరునాయుడు

ప్రజాశక్తి -కొమరాడ : పాఠ్యాంశ రచయితే ఆ పాఠం విద్యార్థులకు బోధించిన అరుదైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఈ విద్యాసంవత్సరంలో తొమ్మిదో తరగతి తెలుగువాచకంలో రంగస్థలం అనే పాఠ్యాంశం ప్రవేశ పెట్టారు. ఆ పాఠ్యభాగ రచయిత ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఆ పాఠ్యభాగాన్ని బోధించే ముందు అవగాహన కొరకు ఒక కవితను ఉపాధ్యాయుడు బోధించాల్సి ఉంటుంది. ఆ కవిత శీర్షిక 'పాట' విద్యార్థులకు ఈ కవితను పరిచయచేయడం ద్వారా పాటకున్న శక్తిని, ఔన్నత్యాన్ని సమాజాన్ని ప్రభావితంచేయడానికి, ప్రజాచైతన్య కోసం పాట ఎలా దోహదపడుతుందో అవగాహన పెంచడానికి అవసరమైన నేపథ్యాన్ని చెప్తూ పాఠం (రంగస్థలం) లోకి విద్యార్థుల్ని ప్రవేశపెట్టగలుగుతాడు ఉపాధ్యాయుడు. పాట పోషించే ప్రధాన భూమికను వివరించే ఈ కవితను బోధించడం విద్యార్థులకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. అయితే ఆ కవితను పార్వతీపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ, కవి, రచయిత గంటేడ గౌరునాయుడు మాష్టారు రచించారు. మంగళవారం గౌరునాయుడు మాస్టార్‌ కొమరాడలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ''రంగస్థల'' పాఠ్యాంశం గురించి, ఆయన రచించిన పాట అనే కవిత గురించి స్వయంగా విద్యార్థులకు బోధిం చారు. దీంతో విద్యార్థుల ఆనందానికి, సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. పాఠ్యాంశం రాసిన రచయితే బోధించడం తమకు కొత్త అనుభూతిని కలిగించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవి, రచయిత గంటేడ గౌరునాయుడు మాష్టారు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తకాలకు దగ్గరగా, సెల్‌ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.