May 25,2023 22:37

పుస్తకాలను ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-హిందూపురం : కవులు,రచయితలు వారు రచించే రచనల ద్వారా ప్రజలు చైతన్య వంతుల్ని చేయాలని ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. గురువారం స్థానిక పెన్షనర్ల భవనంలో తపనా సాహిత్య వేదిక, మనోజ్ఞ సాహిత్య వేదిక సంయుక్తం ఆధ్వర్యంలో కవి, రచయిత ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ రచించిన నజరానా పుస్తకావిష్కరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కవి, రచయిత సడ్లపల్లె చిదంబరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఇక్బాల్‌ హాజరయ్యారు. మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఉపన్యాసకులు డాక్టర్‌ నాగశేషు పుస్తక పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కవులు ఒక రకమైన మూస పద్దతిలో మరీ భిన్నంగా ఆలోచిస్తూ కవిత్వాలను, రచనలు చేస్తున్నారన్నారు. హృదయ స్పందన లేని చదువు వృథా అని కవి భావాలను మనసుతో ఆకళింపు చేసుకోవాలని అన్నారు. కవి కోణం ఒక్కటే కాదని, అనేక కోణాలు ఉంటాయన్నారు. కవి ఒక పదంతో విప్లవాలను పుట్టించగలరని యుద్దాలను సృష్టించగలరని అన్నారు. మనలో చర్యలను, సునితత్వాన్ని, ప్రేమతత్వాన్ని, సేవాతత్వాన్ని ప్రేరేపించగలరన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పలు కవిత్వాలు చదివి వినిపించి, భావాలను వివరించారు. అనంతరం కార్యక్రమం నిర్వహించిన మదన్‌ మోహన్‌ రెడ్డిని అభినందించి, పుస్తకాల ప్రచురణకు రూ.5 వేలను విరాళంగా అందజేశారు. అలాగే సడ్లపల్లె చిదంబర్‌ రెడ్డి స్థానిక మాండలికంలో రాసిన పలు పుస్తకాలను కొనుగోలు చేసి, మరికొన్నింటికి స్పాన్సర్షిప్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈసందర్భంగాకవులు, రచయితలు మాట్లాడుతూ ఒక వర్తమాన సమాజం గురించి తెలిసిన కవి ఆచార్య ఎండ్లూరి సుధకార్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైసూరు విశ్వవిద్యాలయం తెలుగు ఉపన్యాసకులు డాక్టర్‌. నాగశేషు, ఆల్‌ హిలాల్‌ ఆంగ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.అక్బర్‌ షరీఫ్‌, డాక్టర్‌ ఏటిగడ్డ అశ్వత్థనారాయణ, యువకవి గంగాధర్‌, దళితరచయిత గంగాధర్‌, శొంఠిజయప్రకాష్‌, కల్లురు రాఘవేంద్ర రావు, ఎన్‌.రాజశేఖరరెడ్డి, ఉమర్‌ ఫరూక్‌, ఉదరు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.