ప్రజాశక్తి -భామిని : నియోజకవర్గంలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. మండల కేంద్రంలో సోమవారం పాముల సుజన ఫొటోలను వైసిపి నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే వి.కళావతితోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, కొత్తవాళ్లు వచ్చి నియోజకవర్గంలో పార్టీని అప్రతిష్టపాలు చేయొద్దని వైసిపి మండల కన్వీనర్ తోట సింహాచలం అన్నారు. నియోజక వర్గంలో చాపకింద నీరులా కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి సోదరి సుజన, మరిది గువ్వల రమేష్‌బాబు... టిడిపి సానుభూతిపరులతో కలిసి వైసిపిని నష్టపరిచేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సిఎం జగన్ హయాంలో ఎమ్మెల్యే కళావతితోనే తామంటా ఉంటామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జెసిఎస్ కోఆర్డినేటర్ కొత్తకోట చంద్రశేఖర్, సర్పంచులు ఎస్.రాజు, పాపి నాయుడు, పిఎసిఎస్ చైర్మన్ గెల్లంకి రమేష్, పాలక ఉషారాణి, వైసిపి నాయకులు కొత్తకోట ఆంజనేయులు, రొక్కం రమేష్, సంజీవ్‌రావు పాల్గొన్నారు.










