Jun 04,2023 23:20

ఏరువాకలో పాల్గొన్న టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారధి

ప్రజాశక్తి రొద్దం : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం రాష్ట్రప్రజలను నిలువునా ముంచిందని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారధి విమర్శించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మండల పరిధిలోని పెద్దగువ్వల పల్లిలో టిడిపి ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తొలకరి దుక్కులు చేపట్టే కార్యక్రమంలో భాగంగా పార్థసారధి పొలంలో నాగలిపట్టి దుక్కి దున్నారు. ఈ కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం పార్థసారధి స్థానిక విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. నాలుగు సంవత్సరాల కాలంలో రైతులకు డ్రిప్‌, స్పింక్లర్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. టిడిపి హాయంలోనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ నరహరి, నియోజకవర్గ నాయకులు చిన్నప్పయ్య, నరసింహులు, అశ్వర్థనారాయణ, వెంకటరామిరెడ్డి, సర్పంచి నాగరాజు, మంజు, అది, నాగేంద్ర, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
రామగిరి : నాలుగేళ్ల జగన్‌ పాలనలో అన్నదాతలు అప్పులపాలయ్యారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మండలం మాదాపురం గ్రామంలో దుక్కిదున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు వ్యవసాయం మరింత భారంగా మారిందన్నారు. రైతులకు ఎందులోనూ ప్రోత్సాహాకాలు అందించలేదన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఎవరో.. మిగిలిన ఏ శాఖలకు ఏ మంత్రి ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందన్నారు. అధికారులు, ఆర్బీకే సిబ్బంది పొలాల వైపు చూడటం లేదన్నారు.