ప్రజాశక్తి - పెనుకొండ : రైతులను నేరస్తులుగా చిత్రీకరిస్తూ కేసులు పెట్టడం బాధాకరమని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ విమర్శించారు. ఈ మేరకు ఆమె గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టమోటా, పచ్చిమిర్చి, ఇతర నిత్యావసర ధరలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయని సామాన్య ప్రజలు కొనలేకపోతున్నారని అన్నారు. వెంటనే రైతు బజార్ల ద్వారా అతి తక్కువ రేటుకే నిత్యావసరకులు సామాన్య ప్రజలకు అందేలా చూడాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉరవకొండలో శాంతియుతంగా రైతులు బీమా అడిగితే వారిని నేరస్తులుగా చూపి అక్రమ కేసులు పెట్టడం దారుణమని అన్నారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కేసులు ఎత్తేయకుంటే రైతులతో కలసి జైలు భరో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవ నాయుడు, మాజీ జెడ్పీటీసీ రాంపురం సర్పంచి శ్రీనివాసులు, నాయకులు శ్రీరాములు, సూర్యనారాయణ, త్రివేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.










