'రైతులను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం'
ప్రజాశక్తి-ఘంటసాల
రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, రైతు సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేయటానికి సిద్ధమని కౌలు రైతు సంఘ నేతలు పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి, కొత్తపల్లి, ఘంటసాలపాలెం, ఘంటసాల గ్రామాల్లోని రైతులను, కౌలు రైతులను కలసి వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం ఆఫ్ లైన్ కొనుగోలు చేసిన ధాన్యం నగదును చెల్లింపులు ప్రభుత్వం ఇప్పటివరకు చేయకపోవటంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఆనాలోచితంగా రెండు నెలల క్రితం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసి రైతులను అవస్థల పాల్జేస్తోందన్నారు. రైతు అనుకూల ప్రభుత్వంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవటం దారుణమన్నారు. గతంలో ఆఫ్ లైన్ కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్ లైన్ చేయకపోవటంతోనే నగదు పడలేదని రైతులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వం, అధికారులు దీని గురించి సరైన సమాధానం చెప్పకపోవటం బాధాకరమన్నారు. ఎపి కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు కోసూరి శివనాగేంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం కుప్పలపై ఉన్న కొద్దిపాటి ధాన్యాన్ని మాత్రమే ఆన్ లైన్ చేయటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. రెండు రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతోపాటు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆరుగాలం కష్టించిన రైతు ఆర్.బీ.కే ద్వారా ధాన్యం విక్రయించినా రైసు మిల్లులు వారు రైతులను నిలువునా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఆర్.బీ.కేలో నిర్ణయించిన ధర ఏ మాత్రం అమలు కావటం లేదన్నారు. మిల్లర్లు ఎంత ధర చెబితే అంతకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆఫ్ లైన్ లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్ లైన్ చేసి నగదు చెల్లింపులు చేయాలని కోరారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు, జిల్లా సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యద్ధనపూడి మధు, జిల్లా కమిటీ సభ్యులు వాకా రామచంద్రరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యకులు ఎండి.కరీముల్లా, రైతు సంఘం జిల్లా నాయకులు వై.నరసింహారావు, ఘంటసాల మండల సీఐటీయూ నాయకులు మోర్ల రామాంజనేయులు, రైతులు యార్లగడ్డ వీరభద్రరావు, బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనేలా చూడండి
పెదపూడి శివకుమారి రైతు
ధాన్యం నూర్పిడి చేసి పది రోజులైంది. ఇప్పటికీ కళ్ళంలోనే ఉండిపోయాయి. ఆర్.బి.కెలు చుట్టూ తిరిగి విసుకొస్తోంది. పది రోజుల నుంచి కూలీ నాలి మానుకుని ధాన్యానికి కాపలాగా పొలంలోనే ఉంటున్నాం. మా ధాన్యాన్ని కొనేలాగా చూడండి.
డబ్బులు ఇప్పించండి
మేడంకి వెంకటేశ్వరరావు కౌలు రైతు
ఆర్ బి కే ద్వారా ఆఫ్‌లైన్‌లో ధాన్యాన్ని మిల్లుకు తోలాను. 40 రోజులైంది. ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల దాన్ని డబ్బులు రాలేదు. వ్యవసాయ కూలీలకు కొంత చెల్లించాలి. అప్పుల వాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ధాన్యం డబ్బులు ఇప్పించండి.
అమ్ముకోవడానికి ఇంతలా ఎప్పుడూ కష్టపడలేదు
అచంట బసవేశ్వరావు, రైతు
రైతుగా ధాన్యం అమ్ముకోవడానికి ఈ విధంగా ఎప్పుడూ కష్టపడలేదు. కుప్పనూర్చి పది రోజులు ఆర్ బి కే చుట్టూ తిరిగితే ఆన్లైన్లో నమోదు చేసి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వీరంకి లాకులు వద్ద ఉన్నమిల్లుకి తీసుకెళ్లాలన్నారు. అక్కడి వాళ్లుమాకు పక్కనే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిల్లుకి పంపిస్తున్నారు. ఈ విధానం రైతులపై గుదిబండగా మారింది.










