Oct 25,2023 20:52

బస్టాండ్‌ సమీపంలో రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కోసిగి
వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన ప్రతి ఎకరాకూ నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రైతుసంఘం మండల కార్యదర్శి వీరేష్‌ కోరారు. బుధశారం ఆర్‌టిసి బస్టాండ్‌ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌లో రైతులు వేరుశనగ, పత్తి, మిరప, ఉల్లి, ఆముదం తదితర పంటలు సాగు చేశారని తెలిపారు. ఆగస్టులో వర్షాలు కురవకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. మండలంలో వ్యవసాయ కూలీలు దూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టపోయిన ప్రతి ఎకరాకూ నష్టపరిహారం అందించాలని కోరారు. సిఐటియు మండల కార్యదర్శి రాముడు, కెవిపిఎస్‌ మండల కార్యదర్శి హనుమంతు, వ్యకాస మండల కార్యదర్శి నాగేంద్ర, ముక్కరన్న, కాళింగ, ఈరన్న, దొడ్డి హనుమంతు, తాయప్ప, మహానంది, హనుమంతు, కోసిగయ్య, రైతులు పాల్గొన్నారు.