Oct 20,2023 23:44

ఎండిపోయిన తోటలను పరిశీలిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని కొలుకుల గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న బత్తాయి, మిరప, పొగాకు, కంది, పత్తి పంటలను రైతు సంఘం బందం శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతం పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతులు కంది, పత్తి, పొగాకు, మిరప, ఉద్యానవన పంటలు సాగు చేసినట్లు తెలిపారు. నీటి కోసం ఒక్కొక్క రైతు ఐదు నుంచి పది బోర్లు వెయ్యి అడుగుల లోతు వేయించినా చుక్క నీరు రావటం లేదన్నారు. ఒక్కొక్క రైతు ఇప్పటివరకు ఎకరాకు రూ.50 వేల మేర పెట్టుబడి పెట్టారన్నారు. ఇంకో పది రోజులు వర్షం పడకపోతే పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పొగాకు పంటలకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు తోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపత్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దేవండ్ల శ్రీనివాస్‌, టిసిహెచ్‌.చెన్నయ్య, జి.గురునాధం, కెవి.కష్ణగౌడ్‌, సాంబశివరావు, నక్కా తిరుపతయ్య పాల్గొన్నారు.