ప్రజాశక్తి-ఆదోనిరూరల్
ఆదోనిని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం ఇవ్వాలని, రైతులు కూలీలకు కరువు సహాయక చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, వ్యకాస ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎందుట ధర్నా చేపట్టారు. రైతుసంఘం మండల అధ్యక్షులు కె.శేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశులు, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కె.లింగన్న మాట్లాడారు. ఈఏడాది జూన్, ఆగస్టులో సరైన వర్షాల్లేక మిరప, పత్తి, వేరుశనగ, ఆముదం, జొన్నలు, సజ్జలు, చోళకాయలు, టమోటా పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని తెలిపారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌లో వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. వ్యవసాయంపై ఆధారపడిన వ్యవసాయ కూలీలు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు. ఉపాధి హామీ పనులు 100 రోజులు అదనంగా పెంచాలని, రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యల్లో భాగంగా బియ్యం, కందిపప్పు, మంచి నూనె, గోధుమలు, ఇతర 14 రకాల నిత్యావసర వస్తువులు చౌక దుకాణాల ద్వారా ఉచితంగా అందించాలని కోరారు. అనంతరం తహశీల్దార్ వెంకటలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. రైతుసంఘం మండల కార్యదర్శి అయ్యప్ప, సిఐటియు మండల కార్యదర్శి బి.వీరారెడ్డి, కెవిపిఎస్ మండల కార్యదర్శి బి.తిక్కప్ప, డివైఎఫ్‌ఐ మండల సహాయ కార్యదర్శి చిరంజీవి, రైతుసంఘం మండల నాయకులు బాష, హనుమంతు రెడ్డి, మధిర చిన్న తిక్కన్న, కౌలు రైతు సంఘం నాయకులు దస్తగిరి బాష పాల్గొన్నారు. మంత్రాలయం మండలాన్ని కరువుగా ప్రకటించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు జయరాజు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. రైతుసంఘం నాయకులు వీరేష్, సిఐటియు నాయకులు ప్రాణేష్, రైతు సంఘం నాయకులు రాజేష్ పాల్గొన్నారు. దేవనకొండను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.వీరశేఖర్, రైతు సంఘం మండల సీనియర్ నాయకులు శ్రీరాములు డిమాండ్ చేశారు. రైతు, వ్యకాస జిల్లా కమిటీల పిలుపుమేరకు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం మండల కార్యదర్శి సూరి అధ్యక్షత వహించారు. రైతుసంఘం, వ్యకాస నాయకులు యూసుఫ్ బాష, పాండు, సుంకన్న, శ్రీనివాసులు, వీరన్న, రాయుడు, గురు రాజా, రసూల్, అనిల్, వెంకట రత్నం, కాశీం పాల్గొన్నారు. ఎమ్మిగనూరు తాలూకాలోని అన్ని మండలాలను కరువుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు సి.హనుమంతు, ప్రజాసంఘాల నాయకులు రామాంజనేయులు, గోవిందు డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ కె.ఆంజనేయులు, వ్యవసాయ అభివృద్ధి అధికారి మహేశ్వర రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు నరసన్న, సామ్యేల్, పరశురాముడు, దస్తగిరి, కృష్ణ, మాదన్న, సుభాన్, డివైఎఫ్‌ఐ నాయకులు సురేష్, చేనేత సంఘం నాయకులు కృష్ణ, లక్ష్మన్న పాల్గొన్నారు. ఆలూరును కరువు మండలంగా ప్రకటించాలని, ఖరీఫ్‌లో పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తహశీల్దార్ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఎపి రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.హనుమంతు, మండల కార్యదర్శి యు.ఈరన్న మాట్లాడారు. ఈ-క్రాప్ నమోదులో సర్వర్ ప్రాబ్లం, నెట్‌వర్క్ ప్రాబ్లం, యాప్ డౌన్‌లోడ్ కాకపోవడం వంటి కారణాలతో పంటలను సక్రమంగా చేయడంలో కాలయాపన జరుగుతోందని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు రూ.2 లక్షల రుణాలు మాఫీ చేయాలని, రబీ పంటకు అవసరమైన విత్తనాలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిఐటియు మండల నాయకులు తిమ్మప్ప, నాగరాజు, రైతుసంఘం నాయకులు పరమేష్ గౌడ్, అల్లప్ప, వీరేష్, గాదిలింగ పాల్గొన్నారు.
ఆదోనిలో వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










