పుట్టపర్తి రూరల్ : సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం ఆర్‌బికెల్లో దరకాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విత్తన కాయలను పంపిణీ చేస్తామని కలెక్టర్ అరుణ్‌బాబు, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. పుట్టపర్తి వ్యవసాయ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డ్ ఛైర్‌పర్సన్ రమణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా పండించే వేరుశనగకు సబ్సిడీ ఇస్తూ నాణ్యత కలిగిన విత్తనాన్ని సరఫరా చేయాలనే ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రం ద్వారా ఎక్కడా క్వాలిటీ, క్వాంటిటీలో రాజీ లేకుండా నాణ్యమైన విత్తనం అందిస్తున్నట్లు చెప్పారు. నాణ్యమైన వేరుశనగ విత్తనాన్ని రైతులు ఉపయోగించుకోవాలన్నారు. ఎక్కడైనా విత్తనం సరిగా లేదని అనిపిస్తే వ్యవసాయ అధికారిని అడగాలని, నాణ్యత పరిశీలించుకుని మంచి విత్తనం తీసుకెళ్లాలన్నారు. విత్తనాలు మొలకెత్తుతాయా లేదా అనేది ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ట్రేలలో సాగు చేస్తున్నామని, మనం నాటిన విత్తనాలను ఆర్‌బికెల్లో పరిశీలించవచ్చన్నారు. రాయితీ వేరుశనగ విత్తనం నాణ్యత చాలా బాగుందని, అపోహలను సష్టిస్తే రైతులు ఎవరూ నమ్మవద్దన్నారు. జిల్లాలో లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాన్ని పంపిణీ చేసేలా ఈ సీజన్‌ను మొదలు పెట్టామన్నారు. జిల్లాలో 90 శాతం మందికి పైగా రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ ఒక ఎకరానికి 30 కేజీల ఒక బ్యాగ్, రెండు ఎకరాలలోపు ఉన్న వాటికి 2 బ్యాగులు, మూడు ఎకరాలకు పైన ఎంతఉన్నా కూడా మూడు బ్యాగులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను పంట వేయడానికి, వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలని ఇతర అవసరాలకు వీటిని వాడకూడదన్నారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అందరికీ సరిపడా విత్తనాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం మంచి నాణ్యమైన విత్తనాన్ని అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించిన రాయితీ వేరుశనగ విత్తనాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, ఆర్డీవో భాగ్యరేఖ, తహశీల్దార్ నవీన్ కుమార్, ఏడీఏ విద్యావతి, ఎంపిపి రమణా రెడ్డి, మార్క్ఫెడ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.










