సోమందేపల్లి : భూములు లీజుకు తీసుకుని అందుకు సంబంధించిన లీజు డబ్బులు ఇవ్వకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం మోసం చేస్తోందని, దీనిపై అధికారులు స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి సోమవారం నాడు సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యకాసం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో బహదూర్ కంకర ఫ్యాక్టరీ యజమాన్యం నలగొండరాయనపల్లి గ్రామ రైతుల నుంచి భూమిని 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుందన్నారు. ఇందులో మూడు సంవత్సరాల మాత్రమే నష్టపరిహారం చెల్లించి మిగతా ఏడు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు. పేద రైతుల నుంచి కారు చౌకగా భూమల లీజు అగ్రిమెంట్ చేసుకుని, కనీసం ఆ డబ్బులు కూడా చెల్లించకుండా కంకర ఫ్యాక్టరీ యజమాన్యం మోసం చేయడం దుర్మార్గం అన్నారు. అధికారులు దీనిపై తక్షణం స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత రైతులతో కలిసి కంకర ఫ్యాక్టరీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ మురళీకష్ణకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్ కంకర ఫ్యాక్టరీ యజమానులతో చరవాణిలో మాట్లాడారు. ఏప్రిల్ నెలాఖరులోగా లీజు డబ్బులు చెల్లిస్తామని వారు తెలియజేయడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శి రాజగోపాల్, చాంద్‌బాషా, బాబు, బాధిత రైతులు పాల్గొన్నారు.










