Mar 24,2023 20:42

matladutunna mla vallabhaneni vamsi

రైతులకు ధాన్యం బకాయిలు చెల్లింపుకు చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే వంశీ
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం నియోజకవర్గంలో ఆర్‌బికెల ద్వారా రైస్‌ మిల్లులకు ధాన్యం తోలిన రైతులకు పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీ సివిల్‌ సప్లైయిస్‌ కమిషనర్‌ను కోరారు. శుక్రవారం గన్నవరంలో బాపులపాడు మండలం ఆరుగొలను, కానుమోలు, తిప్పనగుంట, గన్నవరం మండలంలోని బుద్ధవరం, కేసరపల్లి, సావర గూడెం, ముస్తాబాద, విజయవాడ రూరల్‌ మండలం నున్న, పాతపాడు గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మెల్యే వంశీని కలిసి ధాన్యం బిల్లులు నెలల తరబడి పెండింగ్‌ పడ్డాయని, అప్పులు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నామని, పెండింగ్‌ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా విన్నవించారు. ఆర్‌ బి కే ల ద్వారా ధాన్యం ఆన్‌లైన్‌లో తోలామని, సాంకేతిక లోపం కారణంగా కొంతమంది ఆఫ్‌లైన్‌లో కూడా ధాన్యం తోలారని ఆయన దృష్టికి తెచ్చారు. నెలల తరబడి బిల్లులు పడని పరిస్థితి ఉందన్నారు. దీనిపై ఎమ్మెల్యే తక్షణం స్పందించి సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌, సివిల్‌ సప్లైస్‌ ఎండిలకు ఫోన్‌చేసి రైతుల సమస్యలను వారితో చర్చించారు. రైతులు, కౌలుదారులకు ధాన్యం బకాయిలు ఉండడం వల్ల అప్పులు తీర్చే మార్గం లేక వారు ఇబ్బందులు పడుతున్నారని, బకాయిల చెల్లింపునకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్‌లైన్‌లో తోలిన ధాన్యానికి ఆన్‌లైన్‌ చేసి డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. సివిల్‌ సప్లయిస్‌ ఉన్నత అధికారులు సానుకూలంగా స్పందించి ధాన్యం బకాయిల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతాంగ సమస్య పరిష్కారానికి సత్వరమే స్పందించిన ఎమ్మెల్యే వంశీకి రైతులు ధన్యవాదాలు తెలిపారు.