Aug 28,2023 20:29

సమావేశంలో మాట్లాడుతున్న తిక్కా రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి
విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, ఇలా ఉంటే రైతులు ఎలా బతకాలని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకర్తి తిక్కారెడ్డి ప్రశ్నించారు. నియోజకవర్గంలో రెండు నెలలుగా వర్షాల్లేవని, తుంగభద్ర నదిలో నీరు లేదని తెలిపారు. బోర్ల కింద పంటలు సాగు చేద్దామంటే ప్రభుత్వం సక్రమంగా విద్యుత్‌ ఇవ్వడం లేదని చెప్పారు. సోమవారం కోసిగిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓవైపు విద్యుత్‌ చార్జీల మోత, మరోవైపు తినడానికి తిండి లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు పొలాల్లో రెండు, మూడుసార్లు విత్తనాలు నాటినా మొలకెత్తలేదన్నారు. ప్రభుత్వం వెంటనే నియోజకవర్గంలోని కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల్లోని రైతులను ఆదుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని మండలాలను కరువుగా ప్రకటించాలని, ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలని డిమాడ్‌ చేశారు. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. తుంగభద్ర నదిలో నీరు లేక ఇసుక తేలి బోసిపోతోందని తెలిపారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని, 2024లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన అశ్వర్థ వృక్ష వివాహ వేడుకలకు తిక్కారెడ్డి హాజరయ్యారు. తిక్కారెడ్డికి స్వాగతం పలికి ఆశీర్వదించి, ప్రత్యేక పూజలు చేశారు. శాలువా, పూలమాల వేసి సన్మానించారు. టిడిపి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, నాయకులు వెంకటేష్‌, నాడిగేని రంగన్న, పెండ్యాల భరద్వాజ్‌ శెట్టి, రవితేజ శెట్టి, హోటల్‌ వీరేష్‌, వడ్డే రామయ్య, ప్రభాకర్‌ రెడ్డి, మాదేవా, ఎంపిటిసి రాజు, నరసయ్య, శ్రీనివాసులు, ఉమర్‌ సాబ్‌, కలందర్‌, వడ్డే ఉల్లిగయ్య, మజ్జిగ రామాంజనేయులు, రాజశేఖర్‌ రెడ్డి, రామయ్య, జనార్ధన్‌, నరసమ్మ, సరోజ, రూతమ్మ, శకుంతల పాల్గొన్నారు.