Mar 20,2023 22:57

కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు.
ప్రజాశక్తి కలక్టరేట్‌ ( కష్ణా )

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని లేదంటే రోడ్లను దిగ్బంధిస్తాం అని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఆఫ్‌ లైన్‌ లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్‌ చేయాలని ఇప్పటివరకు ఆన్లైన్‌ చేసిన ధాన్యాన్ని వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ రైతు మరియు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం పండించిన రైతులు అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ఆఫ్‌ లైన్‌ లో వెళ్ళిన ధాన్యానికి ఆన్లైన్‌ చేయకపోవడంతో ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు డబ్బులు జమ కాలేదన్నారు. అసలే అప్పులు చేసి భార్యలు పుస్తెలు తాకట్టు పెట్టే పంట పండించిన రైతులకు సకాలంలో ప్రభుత్వం డబ్బులు చెల్లించక పోతే వారి పరిస్తితి ఏమిటని ప్రశ్నించారు.పిడిఎఫ్‌ ఎం ఎల్‌ సి లు శాసన మండలిలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం జవాబు ఇస్తూ మరో రెండు లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారని. అయినా ఆఫ్లైన్‌ ధాన్యాన్ని ఆన్లైన్‌ చేయకుండా రైతులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో చెప్పాలన్నారు.స్థానిక అధికారులు చెప్పిన విధంగానే ధాన్యాన్ని మిల్లులకు తోలడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికీ గోనె సంచులు కొరత రైతులను తీవ్రంగా వేదిస్తుందన్నారు.కాబట్టి ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి ధాన్యం సమస్యలు పరిష్కరించాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో రోడ్లు దిగ్బంధిస్తాం అని హెచ్చరించారు .రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసిన నేటికీ కొన్ని మండలాల్లో రెండు ఇప్పటికి కొంతమందికి రైతులకు డబ్బులు జమ కాలేదన్నారు. ఇంకా అనేక చోట్ల దాన్యం కుప్పల రూపాల్లో ఉందని కాబట్టి పెండింగ్లో ఉన్న ధాన్యం డబ్బులను వెంటనే రైతుల కు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే గతవారం లో కురిసిన వర్షాలకు మినుము రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాబట్టి వెంటనే నష్టం అంచనాల రూపొందించి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారావు , ఆయా సంఘాల నాయకులు,ఎల్‌ అజరు ఘోష్‌,వాకా రామచంద్రరావు, శివశంకరరావు, కె రామాంజనేయులు, దుర్గాప్రసాద్‌, రామిరెడ్డి,అలాగే జిల్లా నలు ములల పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా కు వినతి పత్రం అందజేశారు.