మాట్లాడుతున్న దినేష్‌రెడ్డి
రైతుల సమస్యలను పరిష్కరించాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట:డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోవూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పోలంరెడ్డి దినేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని నిడుముసలి గ్రామంలో ప్రతిఅడుగు ప్రజల కోసమే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతమనీ, నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ స్పందించి తక్షణమే నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో పంట అయిపోయిన తర్వాత ఆగస్టు మాసం నుంచి స్థానికంగా ఉన్న కనిగిరి రిజర్వాయర్ పూర్తిగా గేట్లు మూసి వేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రైతులకు రిజర్వాయర్ నుండి నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతులు మొదటి పంటకు సన్నద్ధమవుతుంటే వారికి నీరు అందిచకుండా గేట్లు మూసి ఉన్నారన్నారు. కనిగిరి రిజర్వాయర్ గేట్లు పాడైన కారణంగా రోజుకి 150 నుంచి 200 వృథాగా పోయి ఈరోజు కేవలం 1.7టిఎంసిల నీరు మాత్రమే మిగిలిందన్నారు. అదేవిధంగా సోమశిల జలాశయంలో కేవలం 30 టిఎంసిలు నీళ్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఇకనైనా అధికారులు మేలుకొని ఐఎంపి మీటింగ్ పెట్టి రైతులకు నీళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవూరు ప్రాంతంలో రెండు లక్షల 50 వేల ఎకరాలు సాగు జరుగుతుందని డెల్టా ప్రాంత రైతాంగానికి స్థానిక ఎంఎల్‌ఎ అన్యాయం చేస్తున్నారన్నారు. ఒక ఎంఎల్‌ఎగా ఉన్న ప్రసన్న నేరుగా ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబును అడగకుండా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఆరుసార్లు ఎంఎల్‌ఎ అయ్యామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎంఎల్‌ఎగా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నారుమాడులు వేసుకుంటున్న రైతులకు అధికారులు స్వయంగా నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకొని రైతులకు త్వరితగతిన నీటిని అందించాలన్నారు. రైతులను మభ్య పెట్టేందుకు ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారన్నారు. ఎంఎల్‌ఎ ప్రసన్నకుమార్ రెడ్డికి ధనదాహం తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదన్నారు. రైతుల సమస్యలను తీర్చని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావెల వీరేంద్ర చౌదరి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, టిడిపి సీనియర్ నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి, ఈదురు చెన్నయ్య, టిడిపి నేతలు పాల్గొన్నారు.










