రైతుల సమస్యలను పరిష్కరించాలి
ప్రజాశక్తి - మిడుతూరు
రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాల దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం నాడు మిడుతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో తలముడిపి, జలకనూరు, చింతలపల్లి, దేవనూరు, మిడుతూరు మండల కేంద్రంలోని ఆర్బికే సచివాలయ అధికారులకు, తహసిల్దార్ కాష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్లో ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో వచ్చి అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనం నుండి పంట కొనుగోలు వరకు రైతు భరోసా కేంద్రాలు చూసుకుంటాయని చెప్పినప్పటికీ ఆచరణలో చర్యలు తీసుకోలేదన్నారు. పంటల బీమా, ఇన్సూరెన్స్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఆహార పంటలకు ఎకరాకు రూ.10 వేలు, వాణిజ్య పంటలకు 25వేల రూపాయలకు పెంచాలని కోరారు. వడ్డీ రాయితీ గత సంవత్సరం నుండి పెండింగ్‌లో ఉన్న జీరో వడ్డీ పథకం ద్వారా రైతుల అకౌంట్లో జమ చేసి లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు జీరో వడ్డీ కింద రుణం ఇవ్వాలని, రెండు లక్షల నుండి రూ.5 లక్షల వరకు పావుల వడ్డీకి పెంచాలని రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయాలని అన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించి, అన్ని ఆర్‌బికె సెంటర్లలో విత్తనాలు పూర్తి సబ్సిడీతో ఇవ్వాలన్నారు. ధాన్యాన్ని ఆర్బికే సెంటర్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిడ్తూర్ మండలంలోని మెట్ట పొలాలకు హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించాలన్నారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులిచ్చి రుణ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ గ్రామసభలు ఏర్పాటు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వి రామకృష్ణ, వి. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఓబులేసు, నాగరాజు, మద్దిలేటి, వి రమణ య్య, మిడుతూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం హరి నాయుడు, ఎం శేఖర్, స్వాములు, తదితరులు పాల్గొన్నారు.










