Jul 08,2023 21:48

రైతులకు పంటనష్టపరిహారం మెగా చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌

      పుట్టపర్తి రూరల్‌ : వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతుల అభ్యున్నతి కోసం అన్ని విధాలా చేయూతనందిస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు పుట్టపర్తి మండల పరిధిలోని బీడుపల్లి అభయ ఆంజనేయస్వామి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి పంటనష్టపరిహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేరుశనగ పంట పూర్తిగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుందన్నారు. పంటలు నష్టపోతే వాతావరణ పరిస్థితులను బట్టి రైతులకు పంట బీమా వర్తిస్తుందని చెప్పారు. కంది, మొక్కజొన్న, చీనీ, టమోటా తదితర పంటలకు పుట్టపర్తి వ్యాప్తంగా రూ.16.81 కోట్ల బీమా అందిందన్నారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రూ.157.35 కోట్ల పంటల బీమా వచ్చిందని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. టిడిపి హయాంలో ఐదు సంవత్సరాలకు గాను రూ.4300 కోట్లు బీమాను మంజూరు చేస్తే జగన్‌ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలకే రూ.7,000 కోట్లను రైతులకు అందించిందని చెప్పారు. కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి పదిరకాల మార్పులను చేసి రైతులకు ఎంతో మేలు చేకూర్చారని చెప్పారు. వర్షాధారం ఆధారంగానే పంటల బీమా వర్తిస్తుందని చెప్పారు. అనంతరం పంట నష్టపరిహారం మెగాచెక్కును రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, అగ్రి అడ్వైజరీ కమిటీ ఛైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి, నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ మాధవరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఓబుళపతి, వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు రవి చంద్రారెడ్డి, వైసిపి మండల కన్వీనర్‌ రంగారెడ్డి, రుషికేశవరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సంపత్‌ కుమార్‌, కోఆప్షన్‌ సభ్యులు మాబూసాబ్‌ పాల్గొన్నారు.